గుంటూరు జిల్లా తుమ్మపూడిలో వైసిపి శ్రేణులు హద్దులు మీరి ప్రవర్తించారు.సామూహిక అత్యాచారానికి గురై, హత్య చేయబడ్డా తిరుపతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేతలు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. తిరుపతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్ మీడియాతో మాట్లాడేందుకు వస్తుండగా వారు ఈ దుశ్చర్యకు దిగారు. ఈ దాడిలో పలువురు టిడిపి నాయకులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, వైసిపి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు. వైసిపి నాయకుల పట్ల తాను ఒక మూర్ఖుడిగానే వ్యవహరిస్తానని, ఈరోజు దాడులకు పాల్పడుతున్న ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.
మహిళలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తున్న తనకు చీర, సల్వార్ పంపిస్తానన్న మంత్రి రోజాకు నారా లోకేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే మహిళా మంత్రులు తిరుపతమ్మ విషయంలో దిశ చట్టం అమలు చేసి నిందితులను 21 రోజుల్లో శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా మంత్రిగా ఉన్న రోజా తనపై చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా జాతినే కించపరిచేలా ఉన్నాయని లోకేష్ మండిపడ్డారు. వైసిపి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు మహిళా మంత్రులకు, మహిళా కమీషన్ చైర్మన్ కు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఇక గ్యాంగ్ రేప్ జరగలేదని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పడాన్ని లోకేష్ తప్పుబట్టారు. అసలు పోస్టుమార్టం పూర్తి కాకుండానే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్పారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఈ కేసులో నిందితులను తప్పించే దిశగా కుట్రలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే పోలీసులు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు.తన ఆరోపణల్లో నిజం లేకుంటే ఎస్పీ తన కాల్ రికార్డులను బయట పెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. తనపై ఇప్పటికే 11 తప్పుడు కేసులు పెట్టారని, ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా మహిళల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని నారా లోకేష్ స్పష్టం చేశారు.