నువ్వు ఒకటంటే నేను నాలుగు అననా అనేలా నిన్న మొన్నటి వరకు ఘాటు విమర్శలు చేసుకున్నారు. కట్ చేస్తే ఈరోజు వాటేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇంతకీ ఎవరా నేతలు ? వారిద్దరి రహస్య సమావేశం వెనుక అసలు విషయం ఏమిటి ?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అధికార పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న ఉదంతం దీనినే ఉదహరిస్తోంది. ఏపీలో పాలన వైఫల్యం వల్ల అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తన మిత్రులు తనకు చెప్పారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అననా అంటూ వైసీపీ నేతలు కేటీఆర్ పై ఒంటి కాలితో లేచి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంతో రెండు పార్టీల మధ్య దూరం ఏర్పడిందనే అంతా భావించారట.
కట్ చేస్తే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం దావోస్ లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సిఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పాలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోందట. చిరునవ్వులు చిందిస్తూ ఇరువురు నేతలు తీసుకున్న ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన “నా సోదరుడు, ఏపీ సీఎం జగన్ గారిని కలిశాను”అమీ దానికి టాగ్ లైన్ కూడా పెట్టారు. అంతేకాకుండా కేటీఆర్, జగన్ కలిసి డిన్నర్ కూడా చేశారట, అనంతరం ఓ గంట పాటు ఏకాంతంగా సమావేశం అయ్యారని సమాచారం.. ఈ క్రమంలోనే ఇద్దరి కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట.
కాగా, జగన్, కేటీఆర్ ల ఏకాంత సమావేశం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలు, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు యాంటీ బిజెపి ఫ్రంట్ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి యేతర ఉమ్మడి అభ్యర్ధి దిశగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపధ్యంలో జగన్, కేటీఆర్ ల సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి 2024 లోక్ సభ ఎన్నికలాకౌ ముందు కీలక పరిణామం చోటుచేసుకుండానే చెప్పుకోవచ్చు. జులై 25 తో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిడ్ పదవి కాలం. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం సమాయత్తమవుతోంది.దానిలో భాగంగా జూన్ 10 న జరగబోయే 57 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఎక్కువ శాతం స్థానాలను దక్కించుకోవాలని ఎన్డీఏ ఆశిస్తోందట. అయితే ఎన్డీఏ ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమికి కేవలం 48.9 శాతం మాత్రమే ఓటింగ్ ఉండటం, బిజెపి యేతర ప్రతిపక్షాలకు 51.1 శాతం ఓటింగ్ ఉంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెడితే ప్రతిపక్షం నిలబెట్టిన అభ్యర్ధి సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉంది.
దీంతో గతంలో ఎన్నికల ముందు బిజెపి వ్యతిరేక పవనాలను ఏకం చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కెసిఆర్ అనేక ప్రాంతీయ పార్టీలను కలిసి కేంద్రంలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించకపోవడంతో ఆయన బొక్కబోర్లా పడ్డారనే చర్చ అప్పట్లో బలంగా వినిపించింది. తాజాగా మరోసారి కెసిఆర్ కి అవే పరిస్థితులు ఎదురవ్వడంతో మరోసారి బిజెపి యేతర పక్షాలను ఏకం చేసి ఈసారైనా కేంద్రంలో తన ప్రాభల్యాన్ని చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. అందులో భాగంగా ఇప్పటికే శరద్ పవార్ ని కలిసిన ఆయన పవారే రాష్ట్రపతి అభ్యర్ధి అంటూ ఆయనకు చెప్పారట. అనంతరం యూపీలో బిఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఆమె రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉండాలని కోరారట. ఇక ఇటీవల ఢిల్లీలో మూడు రోజుల పాటు పాగా వేసిన కెసిఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సిఎం అమరెండర్ సింగ్ లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు.అదేసమయంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో పాటు అన్నాహజారే ను కూడా కలిసి బిజెపికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో తనకు మద్దతు ఇవ్వాలని కొరనున్నారట.
మరోవైపు దావోస్ లో జగన్, కేటీఆర్ సమావేశం కూడా ఇందులో భాగమే అని కొందరు చర్చించుకుంటున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో కెసిఆర్ అధ్యక్షతన ఏకం కాబోతున్న ఎన్డీఏ యేతర పక్షాలతో కలవాలని జగన్ ను కేటీఆర్ కోరినట్లు సమాచారం. అయితే జగన్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించారని వైసీపీ వర్గాలలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదిలా ఉంటే జగన్ నిజంగా బిజెపికి వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం చేస్తాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే తన కేసుల విషయంలో కేంద్రం దగ్గర అనేకమార్లు మోకారిల్లిన జగన్ ఇప్పుడు అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఎదిరించే సాహసం చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ ను కాదని బయటకు వచ్చిన జగన్ ను కాంగ్రెస్ మళ్ళీ దరి చెరనివ్వడు అనేది ఆ పార్టీ నేతలె తేల్చి చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో జగన్ విజయం వెనుక బిజెపి ప్రమేయం ఉందనేది రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే జగన్, ఇప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించిన జగన్ మళ్ళీ జత కట్టడం కష్టం అవడంతో పాటు, పరిస్థితితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే భయం ఆయనను వెంటాడుతున్నాయట.
అదే సమయంలో కెసిఆర్ ను కాదని ముందుకు వెళ్ళినా రేపు ఎన్డీఏ యేతర పక్షం అధికారంలోకి వస్తే.. అప్పుడూ తనకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో జగన్ ఉన్నారత. ఈ క్రమంలో జగన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయ్యిందనేది పరిశీలకుల భావన.
మరి జగన్ బిజెపి కి వ్యతిరేకంగా ముందుకు వెళతారా ? లేక కేటీఆర్ ఆఫర్ కు నో చెబుతారా? అనేది వేచి చూడాలి మరి..