మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దక్కిన ఘోర పరాభవంతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే… వైసీపీ నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిక్కు తోచడం లేదు. కూటమి సర్కారు దూకుడుతో అప్పటికే పలు అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డ నేతలంతా పార్టీ ని వడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి దూరం కాగా… వారంతా జగన్ నిత్యం హేళన చేసే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలోకో, ఇప్పటికే పవర్ ప్యాక్డ్ గా నిండిపోయిన టీడీపీలోకో చేరిపోతున్నారు. ఈ వలసలను ఆపే దిశగా జగన్ ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా ఫలితాన్నివ్వడం లేదు, తాజాగా జగన్ తో పాటు వైసీపీ నేతలందరికీ ఏపీసీసీ చీఫ్ షర్మిల రూపంలో సిస్టర్ స్ట్రోక్ తగిలిందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ నేతల మాటలను చూసిన వారంతా ఇదే మాట చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది…
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబ ఆస్తులను చెరి సగం పంచుకోవాల్సిన జగన్, షర్మిల మధ్య అభిప్రాయ బేధాలు పొడచూపాయి. అయితే వాటిని ఎలాగోలా సర్దుబాటు చేసుకునే దిశగా షర్మిల యత్నిస్తుంటే… మొత్తం ఆస్తులు తనవేనంటూ మొండికేస్తున్న జగన్… ఆ ఆస్తుల్లో చిల్లిగవ్వను కూడా చెల్లికి ఇచ్చేది లేదన్న రీతిలో సాగుతున్నారు. తాజాగా చెల్లితో పాటు తన తల్లి వైఎస్ విజయమ్మకు కూడా న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇచ్చేందుకు కూడా జగన్ నిరాకరిస్తున్నారు. దీనిపై గత కొన్నాళ్లుగా అన్నా చెల్లి, తల్లి తనయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. ఇటీవలే ఈ ప్రచ్ఛన్న యుద్ధం బహిరంగమైపోయింది. దీనికి కారణం కూడా జగనేనని చెప్పాలి. తాను తన తల్లి, చెల్లికి కొంత మేర వాటాలు ఇస్తానని రాసిచ్చిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ జగన్ ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్ సీఎల్ టీ)లో పిటిషన్ వేశారు. ఈ చర్యతో తల్లి, చెల్లిని జగన్ ఏకంగా కోర్టుకు లాగినట్టైంది.
ఈ విషయాన్ని పలు ఆంగ్ల పత్రికలు బయటపెట్టగా… ఆ తర్వాత ఈ వ్యవహారంపై జగన్, షర్మిలల మధ్య కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను టీడీపీ సోషల్ మీడియా బయటపెట్టింది. ప్రస్తుతం ఏపీలో ఎవరిని కదిలించినా… ఈ తంతుపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ తనకు అక్కాచెల్లెలేనని చెప్పే జగన్… తన సొంత చెల్లితో పాటు జన్మనిచ్చిన తల్లిని కూడా లాగేంత దుర్మార్గానికి పాల్పడ్డారని జనం వాపోతున్నారు. జగన్ తీరుపై స్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇమేజీ డ్యామేజీ కంట్రోల్ చేసుకోవాలి కదా. అందుకోసం జగన్ మొన్న విజయనగరం జిల్లాలతో పర్యటించిన సందర్భంగా ఈరహా విభేధాలు, గోడవలు ప్రతి ఇంటిలో జరిగేవేనని చెబుతూ… ఆ వ్యవహారమంతా చాలా చిన్నదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల ఘాిటుగా స్పందించారు. గొడవలు అన్ని కుటుంబాల్లో ఉండటం సహజమేనని, అయితే తల్లి, చెల్లిని కోర్టుకు లాగే కొడుకు గానీ, అన్న గానీ ఏ కుటుంబంలో ఉండడని ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాజాగా ఈ ఇమేజీ డ్యామేజీ కంట్రోల్ లోకి వైసీపీ నేతలంతా ఒక్కరొక్కరుగా దిగిపోతున్నారు. తొలుత ఈ వ్యవహారంలోకి మాజీ మంత్రి పేర్ని నాని దిగారు. ఈడీ అటాచ్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన షేర్లను షర్మిల బదలాయించేందుకు యత్నిస్తున్నారని, ఇదే జరిగితే… జగన్ నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేస్తారని నాని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదాన్ని గమనించిన తర్వాతే జగన్ ఎన్ సీఎల్ టీని ఆశ్రయించారని తెలిపారు.అంతేకాకుండా రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తోడబుట్టిన సోదరుడిని జైలుకు పంపేందుకు షర్మిల కుట్రకు తెర లేపారని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత జగన్ బాబాయి వైవీ సుడ్డారెడ్డి కూడా ఇదే వాదనను వినిపించారు. తదనంతరం కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాజాగా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే వాదనను వినిపంచారు. పెద్దిరెడ్డి వెంట మీడియా ముందుకు జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా మీడియా ముందుకు రావడం విశేషం… వెరసి షర్మిల కొట్టిన దెబ్బకు వైసీపీ నేతల మైండ్ మొత్తం బ్లాంక్ కాగా.. అందరి నోటా ఒకటే వాదన వినిపిస్తోందన్న సెటైర్లు పడుతున్నాయి..