టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెట్టారు. లోకేశ్ కు అమెరికా కొత్తేమీ కాకున్నా… ఇటీవల టీడీపీ కూటమి సర్కారు ఏపీలో పాలనపా పగ్గాలుచేపట్టిన తర్వాత ఐటీ శాఖ మంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లడం మాత్రం ఇదే ప్రధమం. దిగ్గజ ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 29న లాస్ వెగాస్ లో జరగనున్న ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు లోకేశ్ హాజరు కానున్నారు. వాస్తవానికి ఈ సద్సుకు హాజరురావాలంటూ అందిన ఆహ్వానం మేరకే లోకేశ్ అమెరికా పర్యటన ఖరారు కాగా… పనిలో పనిగా దిగ్గజ ఐటీ కంపెనీలకు ఆలవాలమైన అమెరికాలో ఆయా కంపెనీలతో వరుస భేటీలు, వాటిని ఏపీకి తీసుకువచ్చే చర్యలకు శ్రీకారం చుడదామన్న ఆలోచనతో లోకేశ్ ఆ సదస్సు కంటే కాస్త ముందుగానే అమెరికా చేరుకున్నారు. అంతేకకుండా సదస్సు ముగిసిన తర్వాత కూడా రెండు, మూడు రోజులు ఆయన అమెరికాలోనే పర్యటించనున్నారు.
ఏపీకి ఐటీ కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాకు పయనమైన నారా లోకేశ్ అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకున్నారు. అమెరికాలో తాను విద్యనభ్యసించడం, అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారితో ఆయనకున్న పరిచయాలు.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఐటీ రంగంలో ఏపీకి పెట్టబడులు రాబట్టేలా లోకేశ్ పక్కా ప్రణాళిొకాబద్ధంగా ఈ పర్యటనకు బయలుదేరారు. వారానికిపైగా అమెరికాలో పర్యటించనున్న లోకేశ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో పాటుగా… అక్కడి తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోనూ వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఈ భేటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ఏ మేరకు అనువుగా ఉంటుందన్న విషయాన్ని లోకేశ్ ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.
శనివారం శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ల్యాండైన లోకేశ్ కు అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో అడుగుపెట్టడంతోనూ తన సుడిగాలి పర్యటనకు తెరతీసిన లోకేశ్ శనివారం ఒరాకిల్ ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఇక ఆ తర్వాత అదే రోజు పత్ర, సినర్జీస్, బోపన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అంతేకాకుండా తన తొలి రోజు పర్యటనలోనే ఆయన భారత కాన్సులేట్ జనరల్ తో భేటీ కానున్నారు. అనంతరం అబోడ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధి బృందాలతోనే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రెండో రోజైన ఆదివారం ఆస్టిన్ చేరుకుని అక్కడి పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. మరునాడైన సోమవారం శాన్ ఫ్రాన్సిస్కోకు తిరిగి చేరనున్న లోకేశ్ రెడ్ మండ్ లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ భేటీ లోకేశ్ టూర్ లో అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవాలి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా… హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తన క్యాంపస్ ను ఏర్పాటు చేసేలా ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కొనసాగిన ప్రస్తుతం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒప్పించారు. తాజాగా ఇప్పుడు ఏపీలోకి మైక్రోసాఫ్ట్ అడుగుపెట్టేలా చేయడమే తన లక్ష్యమన్నట్లుగా లోకేశ్ సాగుతున్నారు. ఈ భేటీలో రానున్న ఫలితం లోకేశ్ మొత్తం టూర్ లోనే కీలకం కానున్నది.
ఇక 29న లాస్ వెగాస్ చేరుకోనున్న లోకేశ్… ముందుగా నిర్ణయించబడిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు కానున్నారు. అమెరికానే కాకుండా పలు దేశాలకు చెందిన ఐటీ సంస్థల ప్రతినిధులు పాలుపంచుకునే ఈ సదస్సులో లోకేశ్ కీలక ప్రసంగం చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కొరియా కంపెనీ కెక్సిమ్ ఈ సదస్సులో లోకేశ్ కు వెన్నుదన్నుగా నిలవనుంది. ఏపీలో ప్రత్యేకించి ఏపీ నూతన రాజధాని అమరావతిలో తాము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పనున్న కెక్సిమ్ ప ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యే ఆయా కంపెనీల ప్రతినిధులను ఏపీ వైపు దృష్టి సారించేలా చేయనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అమెజాన్ లాంటి బడా సంస్థలతో లోకేశ్ భేటీ కానున్నారు. ఆ మరునాడు గూగుల్ క్యాంపస్ ను లోకేశ్ సందర్శించనున్నారు. ఆ తర్వాతి రోజు జార్జియా కుమ్మింగ్స్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేశ్… ఆ మరునాడు న్యూయార్క్ లో పెట్టుబడిదారులతో జరిగే సమావేశంతో తన అమెరికా పర్యటనను ముగించనున్నారు.