వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలల మధ్య నెలకొన్న ఆస్తుల పంచాయితీ ఏపీలో తెగ చర్చనీయాంశంగా మారిపోయింది. గడచిన వారం రోజులుగా ఇటు ఒంటరిగా షర్మిల, అటు మందగా వైసీపీ నేతలు మీడియా సమావేశాలకు క్యూ కడుతున్నారు. ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ కుటుంబ పరువును కూడా వారు లెక్క చేయకుండా దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పంచాయితీ ఎక్కడి దాకా పోతుందో తెలియదు గానీ… ఈ పంచాయితీ పుణ్యమా అని జగన్ నెలకొల్పిన సరస్వతి పవర్ అండఠ్ సిమెంట్ కంపెనీ కథ మాత్రం కంచికి చేరడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగానే.. జగన్ స్థాపించిన ఈ కంపెనీకి గుంటూరు జిల్లాలో ఏకంగా 1,600 ఎకరాల భూ కేటాయింపులు జరిగాయి. జగన్ జమానాలో ఈ భూముల లీజులు ఆ కంపెనీకి శాశ్వతమన్నట్లుగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇప్పటిదాకా ఆ కంపెనీ కార్యకలాపాలే మొదలు కాలేదన్న పచ్చి నిజం బయటపడిపోయింది.
తాజాగా జగన్, షర్మిలల మధ్య నెలకొన్న పంచాయితీ ఈ సరస్వతి పవర్ షేర్ల విషయంలోనే కావడంతో వారి విమర్శలతో పాటుగా ఈ కంపెనీ పేరు కూడా పదే పదే వినిపిస్తోంది. అసలు ఈ కంపెనీ ఎక్కడుంది?… దాని కథాకమామీషు ఏమిటి?.. నిబంధనలకు అనుగుణంగానే ఆ కంపెనీ ఉందా?… భూముల కేటాయింపులు కూడా సక్రమమేనా?… ఇలా ప్రశ్నల జాబితా అంతకంతకూ పెరిగిపోయింది. ఈ క్రమంలో సరస్వతి పవర్ వ్యవహారంపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… సరస్వతి పవర్ కు కేటాయించిన భూముల్లో అటవీ భూములు గానీ, డీకేటీ భూములు గానీ, సర్కారీ భూములు గానీ ఉన్నాయేమో చూడాలంటూ అటవీ, రెవెన్యూ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేరుగా డిప్యూటీ సీఎం నుంచి ఆదేశాలు అందడంతో ఆ రెండు శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు. శుక్రవారం గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో సరస్వతి పవర్ కు కేటాయించిన భూముల్లో మొదలైన సర్వే శనివారం కూడా కొనసాగింది. ఇంకో రెండు, మూడు రోజుల పాటు ఈ వెరిఫికేషన్ సర్వే .జరిగే అవకాశాలున్నాయి.
రెండు రోజుల సర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు 1,000 ఎకరాలకు పైగా సర్వే చేయగా… అందులో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలింది. అదే సమయంలో స్వయంగా సరస్వతి పవర్ కంపెనీనే కేంద్రానికి పంపిన ఓ రిపోర్ట్ లో తమకు కేటాయించిన భూముల్లో 25 ఎకరాల మేర సర్కారీ భూములన్నట్లు పేర్కొన్న విషయం కూడా తాజాగా వెలుగు చూసింది. అంటే… తనకు తానుగా తనకు కేటాయించిన భూముల్లో 25 ఎకరాల మేర సర్కారీ భూములున్నాయని స్వయంగా సరస్వతి పవర్ ఒప్పుకున్నదంటే… సర్వేలో ఇంకెంత మేర సర్కారీ భూములు బయటపడతాయోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం కేటాయించిన భూములకు ఆనుకుని ఉన్న పలువురు రైతులకు చెందిన భూములను సరస్వతి పవర్ కంపెనీ ప్రతినిధులు బలవంతంగా లాక్కున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు రైతులపై దాడులకు కూడా పాల్పడ్డారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
అయినా ఎప్పుడో రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో సరస్వతి పవర్ కు భూములు కేటాయిస్తే… ఇప్పటిదాకా అసలు ఆ కంపెనీ తన కార్యకలాపాలనే మొదలుపెట్టకపోవడం ఏమిటన్న దిశగానూ టీడీపీ కూటమి సర్కారు దృష్టి సారించింది. అంటే… కేవలం కారు చౌకగా భూములను కొట్టేసేందుకే సరస్వతి పేరిట కంపెనీ పెట్టి… భూముల కేటాయింపు జరిగిన తర్వాత జగన్ ఆ కంపెనీ ఏర్పాటును అటకెక్కించారా? అన్న దిశగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆలోచన చేస్తున్న కూటమి సర్కారు భూ కేటాయింపుల సందర్భంగా సరస్వతి పవర్ కు నాటి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలేమిటి అన్న దిశగా కాస్తంత లోతుగా పరిశీలన మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నాటి నిబంధనల్లో ఏ ఒక్క దానిని అయినా జగన్ పాటించకున్నా… కంపెనీ మూతపడటం ఖాయమేనని చెప్పాలి. అదే సమయంలో సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను కూడా కూటమి సర్కారు రద్దు చేసే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.