వైఎస్ విజయమ్మ అమరావతి రాజధానిలో రహస్య పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంతో గోప్యంగా ఆమె అమరావతిలో సచివాలయంతోపాటు అధికారుల క్వార్లర్లు, హైకోర్టులను పరిశీలిచడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అమరావతి రాజధానికి పనికిరాదని ఇక్కడ భవనాలు నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, పైగా వరద ముంపు ప్రాంతమనే కారణాలను చూపుతూ ఏపీ సీఎం రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై అమరావతి రైతులు 291 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. కనీసం విజయమ్మ అయినా తనయుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని మీడియా ముందు రైతులు కోరుతూ వచ్చారు. అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తామని సీఎం ప్రకటించిన తరవాత భూములిచ్చిన అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మీడియాలో గమనించిన వైఎస్ విజయమ్మ అమరావతి రాజధానిలో రహస్య పర్యటన జరిపారని తెలుస్తోంది.
రాజధాని అమరావతిలోనే ఉంటుందా?
ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి రాజధాని తరలింపు వ్యవహారం మరుగున పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద కూడా డబ్బు లేదని, జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వడం కష్టంగా మారిన నేపధ్యంలో రాజధాని తరలింపు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికితోడు రాజధానిపై హైకోర్టులో అనేక కేసులు నడుస్తున్నాయి. వీటిపై త్వరలో రోజువారీ విచారణ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో రాజధాని తరలింపు సాధ్యం కాదని తెలుస్తోంది. రాజధాని తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో వైఎస్. విజయమ్మ అమరావతి రాజధానిలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధానిని తరలించవద్దని విజయమ్మ చెబుతారా?
ఏపీలో మూడు రాజధానులు వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నారు. అయితే అమరావతి రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడం సాధ్యం కాదని తెలిసివస్తోంది. అమరావతి రాజధానిన తరలింపు ప్రకటన రాగానే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఎలా కాలరాస్తారంటూ కేసులు వేశారు. వీరితో పాటు అనేక మంది రాజధానిపై కేసులు వేయడంతో వీటన్నింటిని కలిపి రోజు వారీ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది.
ఇవన్నీ గమనించిన వైసీపీ నేతలు రాజధాని తరలింపుపై పెదవి విప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ అమరావతిలో పర్యటించారు. నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయో.. ఎంతకాలంగా ఆగిపోయాయో అన్నీ ఆమె పరిశీలించారు. నిర్మాణాలకు, నగరానికి అనువైన ప్రాంతం ఇది కానే కాదనే వాదన ఎంత నిజమో ఆమె స్వయంగా చూసి తెలుసుకున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచిస్తారా? లేదంటే అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎత్తలేదు, అంతా గ్రాఫిక్స్ అంటారో వేచి చూడాల్సిందే…
విజయమ్మను జగనే పంపించారా?
అమరావతిలో పర్యటనకు విజయమ్మను సీఎం జగన్మోహన్ రెడ్డే పంపిచారని తెలుస్తోంది. అమరావతి రాజధానిపై 2019 ఎన్నికల ప్రచారంలో విజయమ్మ, షర్మిళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా ఎత్తలేదని, అంతా గ్రాఫిక్స్ అని విమర్శించారు. అలాంటి విజయమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా అమరావతిలో పర్యటించారని భావించలేం.
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయమ్మ చెబితే ఆయన వింటారని కానీ, విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే ధైర్యం చేస్తారని కానీ ఎవరూ భావించడం లేదు. అమరావతిలో చంద్రబాబు ఏమీ చేయలేదని, ఆ భూములు రాజధానికి పనికిరావని చెప్పడానికే విజయమ్మ రాజధానిలో పర్యటించారని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.