ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
వైఎస్ భారతి తండ్రి ఈ సి గంగిరెడ్డి కొంతకాలంగా హైదరాబాదులోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బంజారాహిల్స్ లోని కాంటి నెంటల్ హాస్పిటల్ లో ఈ సి గంగిరెడ్డి భౌతిక కాయానికి ఆయన కుమార్తె వై ఎస్ భారతి నివాళులు అర్పించారు. పార్థివ దేహాన్ని పులివెందులకు తరలించనున్నారు. ఆయన స్వగ్రామం అయిన వేముల మండలం గొల్లల గూడూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పులివెందులలో పేదల వైద్యుడు గా ఇసి గంగిరెడ్డికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గంగిరెడ్డి పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర కూడా చేశారు. ప్రజానాయకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది.
ఇసి గంగిరెడ్డి మృతదేహానికి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల కి రానున్నారు. తాడేపల్లి నుంచి 11 గంటలకు బయల్దేరి తన మామ అయిన ఈసీ గంగిరెడ్డి కి నివాళులు అర్పించేందుకు జగన్ పులివెందులకు చేరుకుంటారు.











