ఒకప్పుడు ఫెదరర్.. ఆ తర్వాత నాదల్.. ఇప్పుడు అదే కోవలోకి చేరేశారు జకోవిచ్. ఒకప్పుడు అసలు వారి దగ్గరికైనా చేరగలడా అనే సందేహమున్న వాడు.. తొమ్మిదో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం చేసుకుని అందరి మనసులను దోచేసుకున్నారు. వారిద్దరినీ దాటేస్తాడేమో అనే నమ్మకాన్ని కలిగించేశారు. గత పదమూడు టోర్నీల్లో నొవాక్ ఏకంగా తొమ్మిదింటిని గెలిచాడంటేనే అతడి ఆధిపత్యాన్ని ఊహించొచ్చు. దాదాపు ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో టాప్‌సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ జకో 7-5, 6-2, 6-2తో నాలుగో సీడ్ మెద్వెదెవ్(రష్యా)పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం జకోదే జోరు. క్రాస్ కోర్టు విన్నర్లతో పాటు తనకెంతో ఇష్టమైన నెట్‌గేమ్‌తో డానియల్‌ను ముప్పతిప్పలు పెట్టిన నొవాక్ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించేశారు.
పదునైన సర్వీస్ షాట్లతో..
సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్‌లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఎగురేసుకుపోయారు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌లో మాత్రమే జొకోవిచ్‌ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. విజయం సాధించిన తర్వాత కోర్టులో వెల్లకిలా పడుకుని చేతులు చాస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ పోరులో మూడు ఏస్‌లు సంధించిన జకో.. 20 విన్నర్లు కొట్టారు. కెన్‌రోజ్‌వెల్(36 ఏళ్లు), రోజర్‌ఫెదరర్(35 ఏళ్లు) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పెద్ద వయస్కుడు జకో (33)నే.
Also Read ;- దాదా.. డోనాల ఏక్ ప్రేమ్ కహానీ!
మరో రెండు సాధిస్తే..
ఈ విజయంతో కెరీర్‌లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించారు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగు పరుచుకున్నారు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్ స్లామ్స్‌తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నారు.
Must Read ;- బేరం బాగుంది : పోర్న్ ఇండస్ట్రీలోకి స్పోర్ట్స్ స్టార్ లు!