తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం తన నివాసంలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమానికి స్పూర్తిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసిన ఎంపి సంతోష్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇప్పటికే ఎంపి సంతోష్ అనేకమంది రాజకీయ నేతలకు, సినీ ప్రముఖులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఆయన ఛాలెంజ్‌కు చాలా మంది స్పందించి పాల్గొన్నారు. మూడవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో విఐపిలు పాల్గొని మొక్కలు నాటారు. మన తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు పక్క ఇండస్ట్రీ ప్రముఖులు కూడా కొందరు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్బంగా మంగళవారం పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, పలువురు శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు చిరంజీవి, దర్శకులు మెహర్ రమేష్, BA రాజు తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.











