2013లో మాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలతో పాటు చైనీస్, సింహళ భాషల్లో సైతం రీమేక్ అయింది. భార్య, కూతురు.. భయంతో, ఆవేశంతో చేసిన చిన్న పొరపాటుకు ప్రాణం కోల్పోతాడు ఒక గొప్పింటి యువకుడు. ఆ కేసు తమ కుటుంబ సభ్యుల మీదకు రాకుండా జార్జ్ కుట్టి అనే సామాన్యుడు ఏ విధంగా పోలీసుల్ని ఏమార్చుతాడు అనేదే దృశ్యం కథాంశం. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. అదే దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. మార్చ్ నెలలోనే సినిమా లాంఛ్ అయినా.. కరోనా ఔట్ బ్రేక్ కారణంగా షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
‘దృశ్యం 2’ టైటిల్ తో రానున్న ఈ సినిమా.. మొదటి భాగంలో మోహన్ లాల్ కూతుళ్ళు గా అన్సిబ, ఎస్తేర్ అనిల్ అనే అమ్మాయిలు నటించారు . పెద్ద కూతురుగా అభినయించిన అన్సిబ ‘దృశ్యం’ తర్వాత కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించింది. అప్పుడు చిన్న కూతురు గా నటించిన ఎస్తేర్ అనిల్ చాలా చిన్నమ్మాయి. ఏడేళ్ళ తర్వాత తిరిగి ఈ సీక్వెల్ లో వారిద్దరూ అవే పాత్రలు పోషిస్తున్నారు . అయితే విశేషమేంటంటే.. ఎస్తేర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా విడుదలైన ‘జోహార్’ తెలుగు సినిమాలోనూ, అలాగే.. మలయాళ సినిమా ‘ఓళు’ లోనూ ఎస్తేర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం మోహన్ లాల్, మీనా, అన్సిబ, ఎస్తేర్ అనిల్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా దర్శకుడు జీతు జోసెఫ్ ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. మరి ‘దృశ్యం 2’ మొదటి భాగం స్థాయిలోనే సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.











