వైఎస్ఆర్ సీపీ గురించి ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఘాటైన సెటైర్లు వేశారు. తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని ఎద్దేవా చేశారు. ఆ కాంప్లెక్స్ నుంచే అరాచకాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సజ్జల రామక్రిష్ణా రెడ్డి రాష్ట్రంలో ఉన్న డాన్లతో సమావేశం అయ్యి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అస్థిరత్వం ఏర్పడేలా చేసి ప్రజల ఆలోచన అభివృద్ధి వైపునుంచి మారల్చేలా చేసే నీచ నికృష్ట ఆలోచన చేశాడని డొక్కా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆయన వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని.. రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్ల ప్రాంతంలో డొక్కా పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంప్లెక్స్ కమాండర్ ప్రభుత్వ మాజీ ముఖ్యసలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని డొక్కా అన్నారు. రాష్ట్రంలో రౌడీలకు, డాన్‌లకు కావాల్సిన ఆర్థిక వనరులను అక్కడి నుంచే అందజేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని ఇటీవల తాడేపల్లి కాంప్లెక్స్‌లో రౌడీ డాన్‌లతో సమావేశం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
పోలీసులు విచారణ జరిపించి సజ్జలపై చర్యలు తీసుకోవాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. కాంప్లెక్స్‌లో జగన్ మోహన్ రెడ్డి సుప్రీం లాగా ఉంటారని.. అన్నారు. సుప్రీం కన్నా కనపడని శక్తి ప్యాలెస్ లో ఉందని ఆ శక్తి ఆదేశాలతోనే కుట్రలు, కుతంత్రాలు అమలవుతున్నాయని ఎద్దేవా చేశారు. చట్టాలని పాటించని వైసీపీ నేతలు.. కూటమి నేతలు చట్టాలు ఫాలో అవడం లేదని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. జగన్ తీరును డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇలా కల్కి సినిమాతో పోల్చడం సంచలనం అయింది. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజికమాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వైసీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నికలకు ముందు గత ఏప్రిల్ లో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. డొక్కా తాడికొండ టికెట్‌ను ఆశించారు. జగన్ కూడా ఆయనకు ఆశ పెట్టి.. ఆఖరికి అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు అవకాశం కల్పించారు. దీంతో డొక్కా వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరే సమయంలో జగన్ పై విమర్శలు కూడా చేశారు. దళితుడిని అయినందున తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, పార్టీలో ఎన్నో అవమానాలకు గురి చేశారని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.











