ఏపీలో మూడు నెలల క్రితం ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మార్పులు చేసే పనిలో ఉన్నారు. తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో కోల్పోయిన ఇమేజ్‌ను తిరిగి పొందేందుకు తన ప్రచార వ్యూహాన్ని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పూడి శ్రీహరి నేతృత్వంలో సీఎంవోలోని ఐ ప్యాక్ మీడియా విభాగం, సమాచార, పౌరసంబంధాల శాఖ, ప్రచార విభాగం వంటి వివిధ మార్గాల ద్వారా నుండి మీడియాకు సమాచారం వచ్చేది.
అంతేకాకుండా, జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవినాష్ నేతృత్వంలోని సీఎంవోలోని ఒక ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీకి చెందిన వ్యక్తుల ప్రత్యేక బృందం ఉండేది. ఇంకా జగన్ కు కమ్యూనికేషన్ సలహాదారులుగా జివిడి కృష్ణమోహన్ ఉండేవారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాతో ఎలా వ్యవహరించాలో సూచించేలా దేవులపల్లి అమర్ కూడా ఉండేవారు. డిజిటల్ మీడియా ప్రచారానికి ప్రత్యేక విభాగం ఉండేది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ నేతృత్వంలో పెద్ద సోషల్ మీడియా టీమ్‌తో సహా వైఎస్సార్‌సీపీకి భారీ క్యాంపెయిన్ టీమ్ కూడా ఉండేది.
అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీలోని మీడియా మేనేజ్‌మెంట్ టీమ్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైంది. సలహాదారులు తమ పదవులను కోల్పోగా.. ఐ ప్యాక్ బృందం దుకాణాన్ని మూసేసుకుంది. ఇక అవినాష్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ కూడా తన సేవలను నిలిపేసింది. శ్రీహరి అనే వ్యక్తితో సహా ఒకరిద్దరు పీఆర్వోలు ఇప్పటికీ వైఎస్ఆర్ సీపీ కోసం పనిచేస్తున్నారు. పార్టీ తరపున మీడియాకు పత్రికా ప్రకటనలు పంపుతున్నారు. సజ్జల భార్గవ రెడ్డి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా టీమ్ కూడా ఫెయిల్ అయినట్లే చెబుతున్నారు.
దీంతో పార్టీ పబ్లిసిటీ వింగ్‌ను పునరుద్ధరించాలని జగన్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో పార్టీ తన ఇమేజ్‌ని తిరిగి పొందడం చాలా అవసరం. అందుకని మొదటి పనిలో భాగంగా ముందు సజ్జల భార్గవ రెడ్డిని లేపేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఒక చురుకైన వ్యక్తిని నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత, స్ట్రేటజీస్ రూపొందించడానికి, మెయిన్ మీడియా, నేషనల్ మీడియాకు సమాచారాన్ని పంపడానికి ప్రముఖ పీఆర్ ఏజెన్సీని హైర్ చేసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మీడియా వ్యవహారాలను నిర్వహించగల, వివిధ విషయాలపై విస్తృతమైన పరిశోధనలు చేయగల అనుభవజ్ఞులైన జర్నలిస్టుల కోసం కూడా పార్టీ వెతుకుతోంది. తద్వారా పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఎదురుదాడిని పెంచాలని భావిస్తోంది. రాబోయే రెండు మూడు నెలల్లో వైసీపీ తాను ప్రక్షాళన చేయదల్చుకున్న పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందని భావిస్తున్నారు.