వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉండగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఎట్టకేలకు మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టు అవుతాననే భయంతో నందిగం సురేశ్ పారిపోతుండగా ఏపీ పోలీసులు హైదరాబాద్ లో పట్టుకున్నారు. అయితే, రహస్యంగా పారిపోవాలనుకున్న నందిగం సురేశ్ పోలీసులకు అంత సులభంగా ఎలా చిక్కాడన్న సందేహం అందరిలోనూ వస్తుంది. అయితే, దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లుగానే భావిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆచూకీని వైసీపీ నేతనే పోలీసులకు ఉప్పందించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ కేసులో నందిగం సురేశ్ అరెస్టుతో సానుభూతి పొందాలనే వైసీపీ అగ్ర నేతలు పోలీసులను సమాచారం అందించినట్లుగా భావిస్తున్నారు.
ఈ విషయంలో టీడీపీ నేత, మాజీ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు నిజమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా మాజీ ఎంపీ నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ వంటివారు నిందితులుగా ఉన్నారు. వీరిలో పోలీసులు మొట్టమొదట మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ వైసీపీ నేతలు అందరిలాగానే నందిగం సురేశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. కానీ, పోలీసులు ఆయనను గురువారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, నందిగం సురేష్ ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ రెడ్డి లీక్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్.
దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ ను అరెస్టు చేయడం ద్వారా ఈ కేసులో సానుభూతి పొందాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ ప్లాన్ వేసిందని తెలిసింది. ఆయన సమాచారాన్ని సజ్జలే కింది స్థాయి నేతల ద్వారా పోలీసులకు చేరవేసేలా చేశారని అంటున్నారు. ఈ కేసులో ఎవర్ని అరెస్టు చేసినా ఫలితం ఉండదని, అందుకే సజ్జలను అరెస్టు చేయాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశ చూపి ఇలాంటి దాడులకు వైసీపీ కుట్ర చేసిందని డొక్కా అన్నారు.
అరెస్టు అయిన తర్వాత పోలీసుల విచారణలో మాజీ ఎంపీ నందిగం.. సజ్జల గురించే కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది. తాడేపల్లిలో పెద్దాయన చెబితేనే చేశానని నందిగం సురేశ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. జగన్‌ను టీడీపీ నేతలు విమర్శిస్తుంటే మీరెందుకు గమ్మున ఉంటారు? అంటూ సజ్జల తమను ఉసిగొల్పినట్లుగా నందిగం చెప్పినట్లుగా సమాచారం. అలాగే గుంటూరు, విజయవాడ నుంచి తాము బయలుదేరామని.. అందరం కలసి ఇనుపరాడ్లు, కర్రలతో లోపలికి చొరబడ్డామని నందిగం విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. చేయించిన అసలు సజ్జల హాయిగా ఉండగా.. తాము మాత్రం జైలు పాలై నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.











