విజయవాడను తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు విజయవాడలోని వివిధ ప్రాంతాలు మునగడానికి ప్రధాన కారణం అయిన బుడమేరు గండ్లను చంద్రబాబు గురువారం పరిశీలించారు. అసలు బుడమేరు వరద తీవ్రతను చూసి చంద్రబాబు చలించిపోయారు. బుడమేరు వాగు చుట్టుపక్కల నిరాశ్రయులైన బాధితులు, రైతుల కష్టాల్ని వింటుండగా.. చంద్రబాబు కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ.. గండి పడిన తీరును చంద్రబాబు పరిశీలించారు. గండ్లను వేగంగా పూడ్చాలని అధికారుల్ని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాక, బుడమేరుకు ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినా కూడా నగరంలోకి నీళ్లు రాకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని ఎలా ఆధునీకరణ చేయాలో కూడా అధికారులకు సూచించారు. బుడమేరు ఆక్రమణల తొలగింపు విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుడమేరు నీరు విజయవాడలోకి రాకుండా కృష్ణా నది, కొల్లేరులో కలిసేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. కొల్లేరు ఆక్రమణలపైన కూడా ఫోకస్ చేస్తామని అన్నారు. బుడమేరు ఆక్రమణలు జరగకుండా ఉండి ఉంటే నగరంలో ఇంత పెద్దస్థాయిలో నీరు నిలిచేది కాదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాల్ని తెలుసుకున్నారు.
తొలుత ఎనికేపాడు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి చిన్న మట్టిరోడ్డుపై ప్రయాణించి.. పొలాల్ని ముంచెత్తిన రైవస్ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై (పడవ లాంటిది) దాటారు. అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని, గండ్లను పరిశీలించారు. బుడమేరు ప్రవాహ తీరు, ఎన్ని గండ్లు పడ్డాయి, వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది? శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆరా తీశారు. వరదలకు మొత్తం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరుపెట్టుకున్నారు. వారికి ధైర్యం చెప్పిన సీఎం.. ఆదుకుంటామని భరోసా కల్పించారు.
తర్వాత కేసరపల్లి చేరుకుని జాతీయరహదారిపై ఉన్న బుడమేరు వంతెన నుంచి ప్రవాహవేగాన్ని పరిశీలించారు. బ్రిడ్జి మీద కలియతిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబు పరిశీలన చేస్తుండగా అదే సమయంలో ట్రాక్‌పైకి ఓ రైలు వేగంగా వచ్చింది. ఆయనకు అతి దగ్గర నుంచి రైలు అత్యంత వేగంగా దూసుకొని వెళ్లింది. ట్రైన్‌ను చూసి వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అందరూ కలిసి బ్రిడ్జి రెయిలింగ్ అంచున నిలబడ్డారు. దీంతో చంద్రబాబుకు కొన్ని ఫీట్ల గ్యాప్ నుంచే రైలు దూసుకెళ్లింది.