ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యూనిట్ ఏపికి వస్తోంది. సోలార్ ఎనర్జీ రంగంలో ఇండస్ట్రీ టాప్ కంపెనీల్లో ఒకటైన వారీ ఎనర్జీ సంస్థ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 8 వేల 175 కోట్ల పెట్టుబడితో 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఈ పరిశ్రమకు ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 2027 జూలై నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్‌ను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో 20 గిగావాట్ అవర్ సామర్ధ్యం కలిగిన లిథఙయం అయాన్ సెల్స్ ఉత్పత్తి, దానికి సమానంగా 20 గిగావాట్ అవర్ సామర్ధ్యం గల బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌కి అవసరమైన బ్యాటరీలు ఉత్పత్తి చేయాలనేది సంస్థ టార్గెట్.
వారీ ఎనర్జీ సంస్థకు గుజరాత్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఉంది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోనూ సోలార్ మాడ్యూల్స్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కంపెనీ అమెరికా, కెనడా, ఇటరీ, తుర్కీయే, వియత్నాంతో పాటు 30 దేశాలకు సోలార్ సిస్టమ్స్ ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం సోలార్ మాడ్యూల్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ.. ఇంధన నిల్వ రంగంలోకి అడుగు పెట్టే లక్ష్యంతో ఏపీలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. వారీ సంస్థ నెలకొల్పుతున్న ప్రాజెక్టు ద్వారా.. పునరుత్పాదక ఇంధనమైన సోలార్ విద్యుత్‌ని గ్రిడ్‌కి అనుసంధానం చేసి.. నిరంతరం సరఫరా చేసే వెలుసులు బాటు కలుగుతుంది.
బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ని బ్యాటరీల్లో స్టోర్ చేసి.. పీక్ అవర్స్‌లో గ్రిడ్‌కి సరఫరా చేయడం ద్వారా కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం పీక్ అవర్స్ డిమాండ్‌కి తగ్గ విద్యుత్ సరఫరా కోసం మార్కెట్లో యూనిట్‌కి 20 రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. సోలార్ విద్యుత్ యూనిట్‌కి 2 నుంచి 3 రూపాయలకే అందుబాటులో ఉంది. స్టోరేజ్, సరఫరా నష్టాలతో కలిపినా.. యూనిట్‌కి 5 రూపాయల లోపే అవుతుంది. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు.. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగి కాలుష్యమూ తగ్గుతుంది. అదే సమయంలో ఇలాంటి పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి, యువత ఉపాధికి దోహదం చేస్తాయి.











