హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ అలంలో ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు అంతస్థుల పాత భవనం కుప్పకూలింది. ఈఘటనలో ఇద్దరు మరణించారు. మరణించిన వారిలో భవన యజమాని కోడలు(23), కుమార్తె(19) ఉన్నట్లు తెలిసింది. కుమారుడి పెళ్లితో కోడలు ఏడాది క్రితమే ఇంట్లో అడుగుపెట్టింది. ఇక కుమార్తె వివాహం మరో వారం రోజుల్లో జరగాల్సి ఉంది. ఈలోపే ఈ సంఘటన జరగడం ఆ ఇంట్లో తీరని విషాదన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని వారందరిని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
సహాయక చర్యల్లో అధికారులు..
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు, ఎన్‌డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఫరాహ బేగం, హనీస్ బేగం మృతి చెందినట్లు తెలిసింది. గాయపడిన వారిలో ఇంటి యజమాని మహ్మద్ ఖాన్, కుటుంబ సభ్యులు అంజాద్ ఖాన్, హుస్సేన్ ఖాన్, హసంఖాన్, పర్వీన్‌బేగం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.
శిథిలావస్తలో భవనాలు..
రెండు రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. పాత భవనం కావడంతోనే వర్షానికి కూలిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాతబస్తీ ప్రాంతంలో శిథిలావస్తకు చేరిన భవనాలు చాలానే ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గుర్తించిన ఇళ్లకు జిహెచ్ఎంసి వాళ్లు నోటీసులు జారీ చేశారు. కానీ చాలా మంది వివిధ కారణాలతో ఆ ఇళ్లను ఖాళీ చేయట్లేరని తెలుస్తోంది. వర్షాకాలంలో ప్రతిసారి ఎక్కడోచోట నగరంలో ఇలా శిథిలావస్తకు చేరిన భవనాలు అప్పుడప్పుడు కూలిపోతున్న ఘటనలు జరుగుతునే ఉంటున్నాయి. శిథిలావస్తకు చేరిన భవనాలపై అధికారులు ఇప్పడైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
భారీ వర్షాలపై సిఎం ఆదేశాలు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమీక్షలు నిర్వహించాలని సిఎస్ కు సిఎం ఆదేశాలు జారీచేశారు. వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులను సిఎం హెచ్చరించారు.











