తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ అగర్వాల్ జోరు కొనసాగుతూనే ఉంది. తన సుదీర్ఘమైన కెరియర్లో ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది .. వీలైనన్ని విజయాలను మూటగట్టింది. కొత్త కథానాయికలు ఎంతమంది వస్తున్నప్పటికీ, కాజల్ కి బదులుగా అనే ఆలోచనను దర్శక నిర్మాతలకు కలిగించలేకపోతున్నారు. సాధారణంగా సీనియర్ హీరోయిన్లకు .. సీనియర్ హీరోల సరసనే అవకాశాలు దక్కుతుంటాయి. కానీ కాజల్ .. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో పాటు, దుల్కర్ సల్మాన్ .. మంచు విష్ణు వంటి యువ హీరోల జోడీగా కూడా మెరుస్తుండటం విశేషం.
ఇప్పుడు కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ .. తమిళంలో కమల్ సరసన ‘ఇండియన్ 2’ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా .. స్టార్స్ కేటగిరి పరంగా ప్రతిష్ఠాత్మకమైనవే. ‘ఇండియన్ 2’ బహుభాషా చిత్రం కావడం ఆమెకి మరింత కలిసొచ్చే అంశం. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ హిట్ తరువాత ఆమె చిరూతో చేస్తున్న సినిమా కావడంతో, ‘ఆచార్య’ పై అందరిలోను ఆసక్తి ఉంది.తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘మోసగాళ్లు’ సినిమాలోను ఆమెనే కథానాయిక. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక తమిళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ఇటీవలే ఆమె ఒక సినిమాను పూర్తి చేసింది. అంతేకాదు .. మరో రెండు సినిమాలను కూడా ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక సినిమాకి దర్శకుడు ‘డీకే’ కాగా, మరో సినిమాకి కల్యాణ్ దర్శకుడు. కల్యాణ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో ప్రభుదేవా. నటుడిగా ఈ మధ్యనే 50 సినిమాలను పూర్తి చేసిన ప్రభుదేవా, మరో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన కల్యాణ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వయసుతోపాటు కాజల్ గ్లామర్ .. ఆమె డిమాండ్ పెరిగిపోతుండటం విశేషమే!