కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనున్నాయి. 21 ప్రధాన కులాలకు చెందిన స్వామి వారి భక్తులు ఏలుబడిలో ఆలయం ఉండటంతో నాటి నుంచి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సాగే ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చేవారు. కానీ ఈ సంవత్సరం అందుకు విరుద్ధంగా జరగనుంది. దానికి ప్రధాన కారణం కరోనా వైరస్. ఈ వైరస్ దృష్ట్యా అధికారులు పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటూ 3 నుండి 4 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దర్శనం టిక్కెట్లు విక్రయానికి చిత్తూరు బస్టాండ్ లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా ఆలయ ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను 15 లక్షలతోనే చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఆదాయం తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భక్తులు అర్ధం చేసుకోవాలని కోరారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఇళ్లలోనే ఉండి వినాయక స్వామిని పూజించాలని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.










