ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు గెలిచారు. రఘురామ కృష్ణంరాజు ఏంటీ జగన్ పై గెలవడమేంటని ఆలోచిస్తున్నారా? తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని… కేంద్ర బలగాలతో తనకు భద్రతను కల్పించాలంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం వై-కేటగిరీ భద్రతను కల్పించింది. ఇది ఓ రకంగా రఘురామకు గెలుపేనని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. వై-కేటగిరి కింద తనకు దాదాపు 11 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని…కర్ఫ్యూని సడలించిన తర్వాత నియోజక వర్గానికి వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు.
కేంద్రం అందించిన భరోసాతో రఘురామ తాజాగా సీఎం జగన్ ను ఉద్దేశించి పరుష పదజాలాన్ని వాడారు. అమరావతి మహిళ రైతులను కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. “ముఖ్యమంత్రిగారూ, వారంతా వేటకుక్కలై వెంటాడే పరిస్థితి వస్తుంది. మహిళలను కించపరుస్తూ పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరసన తెలిపే వారిని కుక్కలతో పోలుస్తారా?. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అపార్థం చేసుకోవాల్సి వస్తుంది. త్వరలోనే అమరావతిలో మనోధైర్య యాత్రను చేపడుతాను. అమరావతికి సంపూర్ణ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రాజధాని రైతులు, మహిళలు అభద్రతాభావానికి గురికావద్దు” అని మండిపడ్డారు. జగన్ కు గుడికడతానన్న గోపాలపురం ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అభిమానం ఉంటే మరో విధంగా చాటుకోవాలి కానీ… గుడులు కడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని” హితువు పలికారు. గత కొన్ని రోజులుగా పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో రఘురామపై వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, హోంశాఖలకు తనకు రక్షణ కల్పించవలిసిందిగా రఘురామ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జగన్ పై రాజు గారి గెలుపుకు కేంద్రం సాయం చేసిందనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.










