ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. 2021 మొదటి భాగంలో ప్రజల కోసం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ ఈ వ్యాక్సిన్ $ 3 లేదా 225 రూపాయలకు అందుబాటులో తీసుకురానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో కీలక భాగస్వామ్యం చేసుకుంది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. వీరు విడుదల చేయబోయే వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండనుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో ఆయా కంపెనీలు ధరలపై స్పష్టత ఇచ్చాయి. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఎస్ఐఐ తెలిపింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ అనుమతులు పొందిన తరువాత ఈ వ్యాక్సిన్ ను ఇండియాతో బాటు ఎల్ఎంఐసీలకు సరఫరా చేయనున్నట్లు ఓ ప్రకటన చేసింది. భారతదేశానికి 100 మిలియన్ మోతాదుల COVID-19 వ్యాక్సిన్లను తమ సంస్థ అందించగలదని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోనికి వస్తే 92 దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఒప్పందం ద్వారా వ్యాక్సిన్ తయారీకి గేట్స్ ఫౌండేషన్ నుంచి ఎస్‌ఐఐకు 150 మిలియన్ డాలర్ల నిధులు అందుతాయి.
ఇదే సమయంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌తో నోవావాక్స్ ఔషధ సంస్థ కూడా తమ వ్యాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అటు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చివరి దశ మానవ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్, గావిసేత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సీరం సీఈఓ అధమ్ పూనావల్లా ట్వీట్ చేశారు. అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గవి సీఈఓ డాక్టర్ సేథ్ బెర్క్ లీ కూడా పేర్కొన్నారు.