సుసంపన్నమైన రాజకీయ చరిత, ఎమ్మెల్యే గా మూడుసార్లు వరుసవిజయాలతో హ్యాట్రిక్ సాధించిన ఘనత ఉన్న రాజా ఆఫ్ బొబ్బిలి, రాష్ట్ర మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘రెండింటికీ చెడ్డ.. ‘ సామెతచందంగా తయారవ్వటానికి స్వయంకృతాపరాధమే కారణమా..? అనే చర్చ నడుస్తోంది. విజయనగరం జిల్లాలో ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరిని ప్రశ్నించినా వెనువెంటనే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకో మనమూ తెలుసుకుందామా.
చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. వర్తమాన రాజకీయాల్లో కూడా బొబ్బిలి రాజులకు అంతకు మించిన ఘనత ఉంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తాతగారు రామకృష్ణ రంగారావు మద్రాస్ ప్రెసిడెన్సీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుజయకృష్ణ తండ్రి గోపాలకృష్ణ రంగారావు మూడో లోక్‌సభకు చీపురుపల్లి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన వారసునిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన సుజయ్ బొబ్బిలి నుండి 2004, 2009లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భూగర్భ, గనులశాఖ మంత్రిగా అందలం ఎక్కారు. మంత్రి హోదాలో పార్టీ పటిష్టతకు గానీ, ప్రజా సమస్యల వరిష్కారానికి పెద్దగా కృషి చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అదే తరుణంలో వ్యక్తి గత భూసమస్యలు పరిష్కరించుకునేందుకు, సొంత ఆస్తులు కూడబెట్టుకునేందుకు తన హోదా వినియోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి అయ్యాక మొఖం చాటేశారు
ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్న సుజయ్, మంత్రి అయ్యాక మొఖం చాటేసినట్లు బొబ్బిలి వాసులు ఆరోపిస్తున్నారు. మంత్రి గా పట్టణాభివృద్ధికి చేపట్టిన చర్యలు పెద్దగా లేకపోవడం, స్థానికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం ఆయన ఇమేజ్‌కు డేమేజ్ చేసింది. అంతేకాకుండా వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి వెళ్లడం, మంత్రి పదవి పొందడం, దాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తదితర కారణాలు హ్యాట్రిక్ వీరుని డక్ అవుట్ చేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండింటికీ చెడ్డ రీతిలో..
వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన సుజయ్ వైఎస్ఆర్ పార్టీకి, అభిమానులకు దూరమవ్వగా టీడీపీ నాయకులతోను, అభిమానులతోను మమేకమవ్వలేక రెండింటికీ చెడ్డట్టుగా తయారయ్యారు. వేరొక వైపు టీడీపి అధినాయకత్వంతోను సత్సంబంధాలు కొనసాగించలేక పోయారు. అందువల్ల ఇటీవల టీడీపీ నియమించిన వ్యవస్థాగత కమిటీల్లోనూ ఎటువంటి స్థానం పొందలేక రాజకీయ చిరునామా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు బాహాటంగా అభిప్రాయపడుతున్నాయి.
వారనీ, వీరినీ చూడకుండా అందరినీ అందలం ఎక్కించిన చంద్రబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన సుజయ్ ను పక్కన పెట్టడంలో ఆంతర్యం అట్టే అర్థమవుతుంది కదా ! మరి బొబ్బిలి రాజా సుజయ్ భవిష్యత్ ఏంటనేది వేచి చూడాలి.











