ఈరోజు ఆగస్టు 15… దీని ప్రత్యేకత స్వతంత్ర్య దినోత్సవమే కాదు సినిమాకు సంబంధంచి కొత్త రికార్డుకు బీజం వేసిన రోజు. అదేంటంటే ‘షోలే’ విడుదల రోజు. కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం ప్రత్యేకించి చరిత్ర సృష్టించడానికే తెరకెక్కుతాయి. చాలా అరుదుగా తెరకెక్కే అలాంటి ఓ సినిమా బిగ్ బి అమితాబ్ సినీ కెరీర్ నే అనూహ్యమైన మలుపు తిప్పింది. దర్మేంద్రకు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టంది. ఆ సినిమా పేరు ‘షోలే’.
బాలీవుడ్ చలన చిత్ర చరిత్రలో ఎందరో జాతకాల్ని మార్చేసిన సినిమా ఇది. బాక్సాఫీస్ ఇండియా వారిచే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా గుర్తింపు పొందింది. వంద సినిమా హాళ్ళలో సిల్వర్ జూబ్లీలు సెలబ్రేట్ చేసుకుంది. రెండు వందల కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ముంబై మినర్వా టాకీస్ లో ఏకంగా ఐదేళ్ళు ఆడి రికార్డు సృష్టించింది. బీబీసీ వారిచే మూవీ ఆఫ్ ది మిలీనియమ్ గా గుర్తింపు తెచ్చుకొంది. బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్ స్టిట్యూట్ ఎంపిక చేసిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలచిన తొలి భారతీయ చిత్రంగా మన్ననలందుకుంది.
ఆ రోజుల్లోనే దాదాపు 150 మిలియన్ వసూళ్లు నమోదు చేసి ‘షోలే’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రికార్డు పందొమ్మిది సంవత్సరాల దాకా చెక్కు చెదరలేదు. 1975, ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ సినిమా .. సరిగ్గా నేటికి 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది.షోలే అంటే ‘నివురుగప్పిన నిప్పు’ అని అర్ధం. పేరుకు తగ్గట్టుగానే ఇందులోని కథాంశం అంతర్లీనంగా సాగుతుంది. రమేశ్ సిప్పీ దర్శకత్వంలో జీపీ సిప్పీ నిర్మించిన ‘షోలే’ సినిమా లో..ఇంకా.. సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్, హేమమాలిని, జయబాధురి లాంటి అగ్రశ్రేణి నటీనటులు అద్భుతమైన పెర్మార్మెన్స్ తో అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. ఆర్డీ బర్మన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఇంకా సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
షోలే కథ విషయానికొస్తే..
రాంఘడ్ అనే ఒక చిన్న ఊరిలో ఠాకూర్ బలదేవ్‌సింగ్ (సంజీవ్‌కుమార్) అనే ఒక మాజీ పోలీసు అధికారి, గబ్బర్‌సింగ్ (అమ్జాద్‌ఖాన్) అనే బందిపోటును పట్టుకొనే ప్రయత్నంలో తన రెండు చేతుల్ని కోల్పోతాడు. ఆ బందిపోటు ఠాకూర్ కుంటుంబం మొత్తాన్ని హతమారుస్తాడు. బందిపోటు గబ్బర్ మీద పగతీర్చుకోవడానికి గతంలో తను అరెస్టు చేసిన వీరూ (ధర్మేంద్ర), జై (అమితాబ్) అనే ఇద్దరు దొంగలను ఠాకూర్ సహాయాన్ని అర్థిస్తాడు. బందిపోట్లకు, ఈ జంట దొంగలకు మధ్య నాటకీయ పక్కీలో పోరు జరుగుతుంది. బందిపోటును పట్టుకొనే ప్రయత్నంలో జై (అమితాబ్) మరణిస్తాడు. చివరకు బందిపోటు పోలీసు అధికారికి చిక్కడం, అతని పట్టుదల నెరవేరడం కథ సారాంశం. ఇందులో హేమామాలిని బసంతిగా, జయబాధురి ఠాకూర్ కోడలు రాధగానూ, హంగల్ ఇమాం చాచా రహీమ్‌గానూ , అస్రాని జైలర్‌గానూ , జగదీప్ సుర్మాభూపాలిగా, ఇఫ్తేకర్ ఇన్‌స్పెక్టర్‌గా ఖురానాగానూ నటించారు.
సలీమ్ జావేద్ జంటకవుల కలం నుంచి జాలువారిన ‘షోలే’ కథ .. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. మొన్నటికి మొన్న రామ్ గోపాల్ వర్మ .. ఈ సినిమాను తనదైన స్టైల్లో ‘ఆగ్’గా రీమేక్ చేయగా.. అమితాబ్ బచ్చన్ అందులో విలన్ గా నటించారు. సినిమా రిజల్ట్ ఏమైందన్న విషయం పక్కన పెడితే.. ఈ తరం ప్రేక్షకులు కూడా *షోలే’ చిత్రాన్ని ఒకప్పటి క్లాసిక్ గా భావించి .. పదే పదే సినిమాను చూడడం ‘షోలే’ సాధించిన గొప్ప విజయం.











