సరిలేరు మా కెవ్వరూ… అంటున్నారు ఈ పిల్లలు…కాదు కాదు పిడుగులు. విషయమేమిటంటే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు మీకెవ్వరు చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో వీరు చేసిన స్పూఫ్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆకాశవాణి ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో వీరు రూపొందించిన ఈ స్పూఫ్ ను మూడు రోజుల్లోనే రెండు లక్షల మంది దాకా చూశారంటే మామూలు విషయమా. వీఐపీ బోయ్స్ టీమ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటుచేసి వీరు చేసిన ఈ ప్రయత్నానికి ‘సరిలేరు నీ కెవ్వరు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఫిదా అయ్యారు.
వీరంతా టీనేజ్ కుర్రాళ్లే…. సింహపురి సింహాలు (నెల్లూరు) గా ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు. ‘రమణా లోడెత్తాలిరా’ అనే ఈ సినిమాలోని డైలాగ్ మాదిరిగానే వీరు కూడా పెద్ద లోడే ఎత్తారు. మొబైల్ ఫోన్ తో షూటింగ్, మూడు గంటల్లో ఎడిటింగ్… వావ్ అనిపించేలా ఉంది కదూ. మూడు ప్రధాన పాత్రలు, 14 మంది గ్యాంగ్ తో ఓ ఖాళీ ప్రదేశంలో షూటింగ్ చేశారు. ఈ స్పూఫ్ దర్శకుడు కిరణ్ తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపేశాడు. స్కూలు ఎగ్గొట్టి సినిమాలు చూసిన బాపతు. మహేష్ బాబు పాత్ర చేసిన మున్నాకు మహేష్ బాుబు అంటే వీరాభిమానం. మూడో వ్యక్తి రబ్బానీ రాజేంద్రప్రసాద్ పాత్ర, విలన్ పాత్ర పోషించాడు. ఎడిటర్ లాయిక్ ఈ స్ఫూఫ్ ను రీక్రియేట్ చేయడంలో మరో కీలకపాత్ర పోషించాడు. మొత్తానికి ఈ నలుగురూ సరిలేరు మాకెవ్వరూ అని నిరూపించుకున్నారు.
‘బసవా… కత్తులు పైకెత్తి విసరడం … పట్టుకోవడం….
రేయ్ … ఎవుడ్రా నువ్వా? శీనా అమ్మోరికి మొక్కినా దీని తల తెచ్చా’ అనే డైలాగులతో అదరగొట్టారు.
సినిమాలో వచ్చే ఆ ఫైట్ సన్నివేశాలకు తగ్గట్టుగా మలిచారు. సౌండ్ సింక్ కావడం,… లిప్ మూమెంట్… అన్నీ అదరహో అనిపించేలా ఉన్నాయి. షూటింగూ మొబైల్ ఫోన్ లోనే, ఎడిటింగూ మొబైల్ ఫోన్ లోనే. దర్శకుడు కిరణ్ కు చిన్నపుడే తండ్రి చనిపోయాడట. యూట్య్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. అవకాశాల కోసం కామెంట్ బాక్సుల్లో మెసేజ్ లు పెట్టినా ఎవరూ స్పందించలేదని అతను వాపోయాడు. ఇక మున్నా విషయానికి వస్తే అతను నల్లగా ఉంటాడు. నల్లోడా నల్లోడా అంటూ ఎగతాళి చేసేవారు. ఏమైనా చేద్దామంటే ‘నల్లగా ఉన్న నువ్వు దేనికీ పనికి రావు రా’ అని అందరూ తనను ఎగతాళి చేసేవారని చెప్పాడు. ‘నా టాలెంట్ ను నిరూపించుకుంటా… అప్పుడు చెబుతా నీ సంగతి’ అనే వాడినని, ఆ అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని మున్నా అన్నాడు. ఇది ఇంత హిట్ అవుతుందని అనుకోలేదని, అన్న కిరణ్ డైరెక్టర్ అయితే తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకుంటే చాలని అన్నాడు విలన్ పాత్రధారి రబ్బానీ.
ఎడిటర్ టాలెంట్ కూడా ఈ వీడియో మేకింగ్ లో కీలకపాత్ర పోషించింది. ఎడిటర్ లాయిక్ గత నాలుగేళ్లుగా మొబైల్ ఫోన్ లో ఎడిటింగ్ చేసేస్తుంటానని చెప్పాడు. మూడు గంటల్లోనే ఎడిటింగ్ పూర్తిచేసినట్లు చెప్పాడు. లైటింగ్ కావాలి కాబట్టి ఎండలో షూటింగ్ చేశారట. వీడియో నిడివి నాలుగు నిమిషాల50 సెకన్లు ఉంది. ‘చిన్న బ్రేక్ ఇస్తున్నాను… తర్వాత బొమ్మ దద్దరిల్లి పోద్ది…’ అనే డైలాగ్ తో దీన్ని ముగించారు.
వీరి టాలెంట్ అద్భుతం: అనిల్ రావిపూడి
ఈ కుర్రాళ్ల టాలెంట్ అద్భుతమని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అని ఆయన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ‘ఇలాంటివి ఎటువంటి జాగ్రత్తలు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ’ అని హెచ్చరించారు.
I am truly stunned and pleasently surprised to see the dedication of these kids … extraordinary.
వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు👌😍
(Note: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ )https://t.co/lzTUwfdoiQ#SarileruNeekevvaru— Anil Ravipudi (@AnilRavipudi) August 10, 2020