పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా సీఎం జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నాడని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నివర్ తుపానుతో ఏపీలో 20 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే కేవలం 6 లక్షల ఎకరాలేనని మంత్రులు అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ సైకో పాలన చూస్తూ ఉంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు గ్యారంటీగా వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. ప్రజలు ఏ పూనకంతో ఓటేసారో కానీ.. ఈ రాష్ట్రానికి జగన్ సీఎం అయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలా.. ఇంకా ముందేనా..
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయితే జమిలి ఎన్నికలు వస్తాయని ప్రధాని మోడీ ఇప్పటికే 150 సార్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో వస్తాయి. జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని ప్రధాని మోడీ కూడా క్లియర్ గా చెప్పలేదు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మోడీ చెప్పిన జమిలి ఎన్నికలు 2023లో వస్తాయంటున్నారు. అయితే చంద్రబాబు చెబుతోంది మాత్రం జమిలి ఎన్నికల గురించి కాదట. సీఎంపై ఉన్న సీబీఐ కేసుల్లో మరో రెండు నెలల్లో జగన్ జైలుకు వెళతారనే అభిప్రాయంతోనే చంద్రబాబు ఇలా చెబుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీ ముక్కలు కావడం, ఏపీ ఎన్నికలు జరగడం ఖాయమని ప్రతిపక్షనేత బలంగా నమ్ముతున్నారని సమాచారం. అందుకే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంత గ్యారంటీగా చెబుతున్నారట.
అప్పుల్లో ఏపీని నెంబర్ వన్ చేశారు
అప్పులు తేవడంలో సీఎం జగన్ ఏపీని నెంబర్ వన్ చేశారని, కేవలం ఒకటిన్నర ఏడాది వైసీపీ పాలనలో లక్షా 20 వేల కోట్ల అప్పు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఏపీలో గాడి తప్పిన ఆర్థిక పరిస్థితిపై కాగ్ అక్షింతలు వేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో సస్పెండ్ అయిన తరవాత, నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు అందరూ మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు అనేక విషయాలపై మాట్లాడారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా, చెల్లించామని చెప్పి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 20 రోజుల్లో పంట నష్ట పరిహారం మేమే ఇస్తామని మంత్రి ప్రకటించడం రైతుల్ని మోసం చేయడమేనని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో పాలన చూస్తుంటే ముందస్తు ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయని, టీడీపీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.











