మలయాళ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులోకి అనువాదమై ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది. మలయాళంలో ఈ సినిమా విడుదలకు ముందే అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు పొందింది. తెలుగులో విడుదలైనప్పుడు కూడా మంచి రివ్యూలే వచ్చాయిగానీ ప్రేక్షకుల నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యింది. తాజాగా ఆస్కార్ కు నామినేట్ అవడంతో ఈ సినిమాను చూడాలన్న తహతహ తెలుగువారిలోనూ ఎక్కువైంది.
దాంతో ‘ఆహా’లో ఈ సినిమా చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. ‘ఆహా’ కూడా ఈ సినిమా ప్రమోషన్ మీద దృష్టిపెట్టింది. విదేశీ భాషా చిత్రాల కేటగిరీలో ఈ సినిమాకి చోటు దక్కింది. నామినేట్ అయిన సినిమాలు ఉన్నా ఇంతవరకూ ఈ సినిమాకూ అవార్డు దక్కలేదు. మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ సినిమాలు ఇప్పటిదాకా ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. కానీ ఒక్కదానికి కూడా అవార్డు దక్కలేదు. మరి ఈసారి భారతీయుల ఆశలన్నీ జల్లికట్టు మీదే ఉన్నాయి.
అసలు ఆస్కార్ అవార్డుకు ఈ సినిమా అర్హత ఉందో లేదో తెలియాలి కాబట్టి అందరూ ఈ సినిమా చూసే పనిలో పడ్డారు. ఒకవిధంగా ఆహా ఓటీటీకి ఇది కలిసి వచ్చే అంశమని కూడా అనుకోవాలి. ఈ సినిమా కథ కేవలం ఓ దున్నపోతు చుట్టూ తిరుగుతంది. హరీష్ రాసిన మావోయిస్ట్ అనే చిన్న కథ ఈ సినిమాకి ఆధారం. సాధారణంగా మలయాళ చిత్రాలు అక్కడ హిట్ అయితేనే తెలుగులోకి అనువాదమయ్యేవి. ప్రాంతీయ ఓటీటీ ఆహా పుణ్యమా అని అనేక మలయాళ సినిమాలు తెలుగులోకి అనువాదమై విడుదలవుతున్నాయి. లేకుంటే సబ్ టైటిల్స్ మీద ఆధారపడి సినిమా చూడాల్సి వచ్చేది.