నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు. ఆయన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికంగా అసంతృప్తి ఉంది. అయితే వారు ఒక వెరైటీ పద్ధతిలో తమ అసంతృప్తిని బయటపెట్టారు. దాన్ని చూసిన వారెవరైనా సరే.. వెంటనే నవ్వుకునేలా.. అదే సమయంలో ఎమ్మెల్యే వైఫల్యాలను కూడా తెలుసుకోగలిగేలా వారు ఝలక్ ఇచ్చారు.

సాధారణంగా ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ.. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన సందర్భాల్లో ‘ఎమ్మెల్యే కనిపించుట లేదు’ అంటూ పోలీసు కంప్లయింటు ఇవ్వడం, గోడల మీద పోస్టర్లు వేయడం లాంటి వెటకారపు పనులు చేస్తుంటారు. అలాంటి పోలీసు కంప్లయిట్లు వార్తల రూపంలోకి మారిన తర్వాత.. సదరు ప్రజాప్రతినిధులు పరువు నష్టంతో సిగ్గు పడడం జరుగుతూ ఉంటుంది.
అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఓ వెరైటీ ఝలక్ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఇటీవల మూడు కోట్ల రూపాయలు పెట్టి తనకోసం ఓ కారుకొన్నారు. ఆయన కారుకొన్న సంగతి పెద్ద వార్తగా ప్రచారంలోకి వచ్చింది కూడా. మైలారం బాలు అనే వ్యక్తి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఓ పెద్ద ఫ్లెక్సి వేశారు. 3 కోట్ల కారు కొన్నందుకు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పారు. ఆ కారు ఫోటోలను కూడా ఆ ఫ్లెక్సిలో పెట్టారు. అలాగే.. ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే గేటు దగ్గర ఉన్న రోడ్డు ఎంత దుస్థితిలో ఉందో కూడా ఆ ఫ్లెక్సిలో మరో ఫోటో పెట్టారు.
‘‘ఆర్మూర్ ప్రజల కోసం కాకపోయినా.. కనీసం తన 3 కోట్ల రూపాయల కారుకోసమైనా సరే.. ఈ రోడ్డును ఎమ్మెల్యే రిపేరు చేయించాలంటూ’’ ఆ ఫ్లెక్సిలో విన్నవించుకున్నారు. ఈ వెటకారం మరీ ఎక్కువైంది. సొంత కారు కోసం రోడ్డు బాగు చేయించాలంటూ ఈ విజ్ఞప్తి.. ఎమ్మెల్యేకు చెంపపెట్టులాగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











