‘ఒకే దేశం ఒకే పన్ను’ అనే భావనతో తీసుకువచ్చిన జీఎస్టీ గాడి తప్పుతోంది. జీఎస్టీ తో నష్టపోతామని చాలా రాష్ట్రాలు మొదట ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తరువాత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అన్నీ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును స్వాగతించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు నష్ట పరిహారం అందించేందుకు కేంద్రం ఒప్పుకుంది. పెట్రోల్, డీజిల్ మినహాయించి 2017లో అన్నీ వస్తువులను జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కరోనా తీవ్రతతో కేంద్రం దగ్గర నిధులు అడుగంటాయి. ఇదే సమయంలో రాష్ట్రాల పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రాలు జీఎస్టీ బకాయిలపై భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. కరోనాపై నెపం నెట్టేసిన కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుందామని ప్రయత్నం చేసింది.
కానీ రాష్ట్రాల వత్తిడితో ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. రెండు కొత్త ప్రతిపాదనలను ఆమె ప్రతిపాదించారు. 97 వేల కోట్లను రుణాలుగా ఆర్బీఐ ద్వారా ఇప్పిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటే రాష్ట్రాలు భారీగా నష్టపోనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన రెండో ప్రతిపాదన ప్రకారం 2.37 లక్షల కోట్లకు రుణాలను రాష్ట్రాలకు కేంద్రం ఇప్పిస్తోంది. వడ్డీ మాత్రం రాష్ట్రాలు చెల్లించవలసి ఉంటుంది. భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఒప్పుకుంటే రాష్ట్రాలపై వడ్డీ భారం పడనుంది. ఈ వడ్డీ భారంతో మునుముందు రుణాలపై కూడా ప్రతికూలత చూపనుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తమ వాటాలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలకు వారం గడువు ఇచ్చారు. ఈ గడువు లోగా తమ నిర్ణయాలను తెలియచేయాలని ఆమె కోరారు.
కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిప్పులు చెరిగారు. రాష్ట్రాలతో కేంద్రం ఆడుకుంటోందని ఆయన విమర్శలు చేశారు. ఆర్థిక నిపుణులు, మేధావులు కూడా కేంద్రం ప్రతిపాదనలు సరైన రీతిలో లేవని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సమీక్ష వివరాలను ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు నెలలకే 8 కోట్లు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 వేల కోట్లు అదనంగా రావలసిన ఆదాయాన్ని నష్టపోయిన దేశ అభివృద్ధ్ది కోసం జీఎస్టీలో చేరామని ఆయన గుర్తు చేశారు.
3 లక్షల కోట్ల పన్నులను లక్ష 65 వేల కోట్లకు తగ్గించడం దారుణమని ఆయన బాధను వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు ఒకటేనని మండిపడ్డ ఆయన రావలిసిన బకాయిలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారిపై నెపం నెట్టేస్తున్నా కేంద్రం అంతకు ముందు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం గమనార్హం. మొత్తం మీద చూస్తే కేంద్రానికి రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లించడంలో గతిలేదని చెప్పకతప్పదు. రాష్ట్రాల నుంచి ముక్కుపిండి వసూలు చేసే కేంద్రం తాము ఇవ్వవలసిన బకాయిల విషయంలో మాత్రం చొరవచూపకపోవడం దారుణమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.











