అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు కొత్త విషయం ఏమి కాదు.టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, శిద్దా రాఘవరావు, చందనా రమేష్, పంచకర్ల రమేష్ బాబులు వైసీపీలో చేరారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. వీరందరూ గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నాయకులు. ఓటమి చెందిన నాయకులకు వైసీపీ రెడ్ కార్పెట్ పరిచి పార్టీ జెండా కప్పేస్తోంది. ఇక్కడే వైసీపీ అజెండా అర్ధమవుతోంది. 2019లో జరిగిన ఎన్నికలలో గెలిచిన కొందరు టీడీపీ, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీ వెంట నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు-2 ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి బహిరంగంగానే మద్దతు తెలిపారు. జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ వెంట నడుస్తున్నారు.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరికీ ఓటు వేసారో అందరికి తెలుసు. ఇంత డైరెక్ట్ గా మద్దతు తెలిపిన వారికి వైసీపీ జెండా ఎందుకు కప్పలేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వీరిపై చర్య తీసుకోవాలని టీడీపీ సభ్యులు ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఇంకా ఆయన వీరిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా గంటా శ్రీనివాసరావు, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, వాసుపల్లి గణేష్ లాంటి వారు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. వారి విషయంలో వైసీపీ ఏ పంధాను ఫాలో అవుతుందో చూడాలి. వైసీపీ టీడీపీ కాపు నాయకులపై ద్రుష్టి పెట్టిందని చెప్పక తప్పదు. పంచకర్ల రమేష్ బాబు, చలమలశెట్టి సునీల్ లాంటి కాపు నేతలకు వైసీపీ నేతలు గాలం వేస్తున్నారు.
విద్యావేత్త, పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ కు రాజకీయాలలో అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆయన 2009లో మొదటి సారిగా పోటీ చేశారు. 2009లో కాకినాడ లోకసభ నుంచి పోటీ చేశారు. పల్లంరాజు చేతిలో దారుణ పరాజయానికి గురయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన తిరిగి 2014లో కాకినాడ నుంచే పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఆయన పరాజయం చెందారు. జగన్ తో విభేదించి ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన 2019లో కాకినాడ నుంచే పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతా చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. మొత్తం మీద తిరిగి తిరిగి ఆయన వైసీపీలో చేరినట్లు అర్ధమవుతోంది.