(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కింజరాపు సురేష్ 1700 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన ప్రత్యర్ధి కింజరాపు అప్పన్నకు 157 ఓట్లు పోలయ్యాయి. ఆద్యంతమూ ఉత్కంఠ రేపిన నిమ్మాడ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. నాలుగు దశాబ్దాల నిమ్మాడ చరిత్రలో తొలిసారిగా పంచాయతీకి ఎన్నికలు జరుగాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ పరిశీలించారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో పాటు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉద్వేగానికి గురైన అచ్చెన్న
అచ్చెన్నాయుడు మంగళవారం బెయిల్‌పై బయటకు వచ్చాక ఉద్వేగానికి గురయ్యారు. ఆయన్ను ఆహ్వానించేందుకు వచ్చిన నాయకులను, కార్యకర్తలను చూసి కంట తడి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చేయని తప్పునకు, సంబంధంలేని ఇష్యూకి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. “అరెస్ట్ చేసినందుకు నేను భయపడటం లేదు , బాధపడటం లేదు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. నిమ్మాడ పంచాయతీ ఎప్పుడూ ఏకగ్రీవంగానే కొనసాగుతోంది .. నాపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. అందుకే మేం ఈసారి ఏకగ్రీవం కావాలని కోరుకోలేదు. అప్పన్న సోదరుడు కోరినందునే అప్పన్నకు ఫోన్ చేశాను. ఫోన్ కాల్ సంభాషణ రికార్డవుతుందని నేను ఊహించలేదు. అయినా నేను ఫోన్ కాల్‌లో బెదిరించినట్లు ఎవరైనా నిరూపించండని సవాల్ విసురుతున్నా” అని అన్నారు. “నేను బెదిరించానని నిరూపిస్తే …ఇప్పటికిప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నాకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తా. ఈ రోజు సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు. ఏకగ్రీవాల కోసం ఒత్తిడి తెచ్చినా మా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం” అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థను చూస్తే సిగ్గేస్తోంది
“పోలీసు వ్యవస్థను చూస్తే సిగ్గేస్తోంది. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆ ఉద్యోగానికి అనర్హుడు. నేను బెదిరించానో లేదో… ఆడియో విని చెప్పండి. నాపై ఇంత దారుణంగా వ్యవహరించినా అనుభవమున్న తమ్మినేని, ధర్మాన సోదరులు ఎందుకు మౌనం వహించారు. వారి అనుభవం ఏమయ్యింది” అని ప్రశ్నించారు. వీటన్నింటికీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలి అని స్పష్టం చేశారు.











