ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 227 పరుగుల తేడాతో భారీ ఓటమి మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి(72), ఓపెనర్ శుభ్‌మన్ గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీం డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించిన పంత్ సైతం 11 పరుగులకే నిష్క్రమించారు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారా 15 పరుగులకే అవుట్ అయి క్రీజును వీడారు.
కోహ్లి ఒంటరి పోరాటం వృథా
రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌట్ కావడంతో, కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, ఆండర్సన్ 3 వికెట్లు తీయగా.. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, డామ్ బెస్‌లకు తలో వికెట్ దక్కింది. ఇక ఆస్ట్రేలియాలో టెస్టు విజయంతో జోష్ మీదున్న టీమిండియాకు భారీ షాకిచ్చిన జో రూట్ సేన, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగనున్న రెండో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది.
నాలుగో ర్యాంకుకు టీమ్ఇండియా..
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో టీమ్ఇండియా ర్యాంకు మరింత దిగజారింది. సునాయాసంగా ఫైనల్‌కు చేరుకొనే స్థాయి నుంచి కష్టపడితే తప్ప చేరుకోలేని పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో కోహ్లీసేన ర్యాంకు నాలుగుకు చేరుకుంది. ఛాంపియన్‌షిప్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్ ఆడే సంగతి తెలిసిందే.

కసి.. కనిపించలేదు: కోహ్లీ
తమ దేహభాష, ఆటలో స్థాయికి తగిన తీవ్రత కనిపించలేదని టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కొన్ని పొరపాట్లు చేశామని అంగీకరించారు. మరింత ప్రొఫెషనల్, నిలకడగా ఆడాల్సిందని పేర్కొన్నారు. 420 పరుగుల లక్ష్య ఛేదనలో 227 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత అతడు మాట్లాడారు.
‘అవును, మా దేహభాష, తీవ్రత స్థాయికి తగ్గట్టు లేవు. రెండో ఇన్నింగ్స్‌లో మేం మరింత మెరుగ్గా ఉన్నాం. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలోనూ మెరుగ్గానే ఉన్నాం. మేం ఎక్కడ బాగున్నామో ఎక్కడ బాగాలేమో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేమెప్పుడూ మెరుగవ్వాలనే కోరుకుంటాం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మా కన్నా మెరుగ్గా, నిలకడగా ఆడింది’ అని విరాట్ అన్నారు.











