అరుదైన గ్రహాల కలయికకు మళ్లీ ఈ ఫిబ్రవరి నెల వేదికైంది. అంతరిక్షంలో తరచూ ఇలాంటి అరుదైన గ్రహకలయికలు ఏర్పడుతుంటాయి.
ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి తెరతీసినట్లవుతోంది. సాధారణంగా ప్రతి 59 ఏళ్లకూ ఒకసారి ఏడు లేదా 8 గ్రహాలు ఒకే రాశిలో కలవడం జరుగుతుంది. 2019లో డిసెంబరు 26 నుంచి 28 వరకూ ఈ షష్ఠ గ్రహ కూటమి వల్లే కరోనా ప్రబలిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి గ్రహ కలయిక ఈరోజు జరిగింది. ఈ ఫిబ్రవరిలో 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ షష్ఠ గ్రహ కూటమి కొనసాగుతుంది. 2019లో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడి నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడింది. అన్ని గ్రహాలూ రాహుకేతువు మధ్య బందీ అవడాన్ని కాలసర్పదోషం అంటారు. ఈసారి కూడా అలానే జరిగింది.
ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడటం అరుదైన విషయమే అయినా దీనికి వైరస్ పుట్టుకకూ ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది తేలాలి. ఆరు గ్రహాలు మాత్రమే కాదు మనకున్న నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఇలాంటి అష్ట గ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు 8 గ్రహాలు మకర రాశిలో కలిశాయి. ఆ ఏడాది రష్యా, అమెరికాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ పరిణామం యుధ్దాలకు దారితీసింది. అంతటా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 2019 డిసెంబరులో ధనుస్సు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిశాయి.
కచ్చితంగా అదే సమయంలోనే వైరస్ ప్రబలడం మొదలైంది. ఈసారి రాహుకేతువులు ఈ ఆరు గ్రహాలకూ దూరంగా ఉన్నాయి. 1979 సెప్టెంబరులో కూడా ఇలాంటి అరుదైన గ్రహ కలయిక జరిగింది. సింహ రాశిలో ఐదు గ్రహాలు కలిశాయి. ఆ సమయంలో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవంతో ముస్లిం సమాజంలో ఆందోళనలు చెలరేగాయి. ఫలితంగా ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్ లలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది. ప్రస్తుతం మకర రాశిలోకి గ్రహ కలయికల వల్ల విపత్కర పరిస్థితులు కలగవచ్చని జ్యోతిష పండితులు అంటున్నారు. రానున్న రెండు నెలల కాలంలో కొన్ని విపత్కర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చైనా, పాకిస్థాన్ లు చాలా ఇరకాటంలో పడవచ్చని కూడా అంటున్నారు. భారత్ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. మకరం అనేది కర్మ స్థానం. ఈ రాశిలో ఆరు గ్రహాలు కలవడం అన్నది భౌగోళిక, రాజకీయ పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. కుజ, శని, గురు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యుద్ద వాతావరణాలు నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా కుజుడికి మకరం ఉచ్ఛరాశి. ప్రజల్లో తిరుగుబాటుకు ఈ గ్రహ కలయిక తోడ్పడవచ్చన్నది జ్యోతిష్కుల అంచనా. ఈ అరుదైన గ్రహ కలయికలపై నారదుడు ఓ గ్రంథం కూడా రాశాడని చెబుతుంటారు. ఈరోజు ఏర్పడిన గ్రహ కలయిక లాంటిది 59 ఏళ్ల క్రితం ఏర్పడిందని అంటున్నారు. మరి ఎలాంటి పరిణామాలకు ఈ గ్రహ కలయిక దారితీస్తుందో చూద్దాం.