సైఫ్ అలీ ఖాన్ ఓ వినూత్నమైన పాత్రను పోషించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్‌తో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు ‘ఫైర్’ అని ప్రచారంలో ఉంది. ఇందులో ఆయన అగ్నిమాపక సిబ్బంది పాత్రను పోషించబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ సినిమాకి రాహుల్ డోలాకియా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది. తుకారామ్ అనే అగ్నిమాపక విభాగంలో పనిచేసే వ్యక్తి కథ ఇది.
అతను తన ఉద్యోగ జీవితంలో ఎలాంటి సాహసాలు చేశాడు? ఎంతమంది ప్రాణాలను కాపాడాడు? తన జట్టును అతను ఎలా చైతన్యపరిచేవాడు అనే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే అగ్నిమాపక దళం కథాంశంతో తెరకెక్కే మొదటి చిత్రం ఇదే అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. రీస్ సినిమా సమయం నుంచే దర్శకుడు రాహుల్ డోలాకియా ఈ కథ మీద కసరత్తులు చేసినట్లు సమాచారం. జాతీయ అవార్డు పొందిన డైలాగ్ రైటర్ విజయ్ మౌర్యతో కలిసి ఆయన ఈ కథను రాశారు. దీనికి ఫరా అక్తర్ కూడా సహకరించారట. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైందట.
ఇలాంటి సినిమాకి ఓ మంచి సెట్ కూడా అవసరం. పైగా అది అగ్నిప్రమాదంలో ఆహుతి కావలసి ఉంటుంది. దీనికి ఎలాంటి సెట్ వేయాలి అనేదాని మీద కసరత్తు జరుగుతోంది. సెట్ తయారీ, యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు దీనికి అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారాన్ని తీసుకోనున్నారు. ప్రస్తుతం డోలాకియా తాప్సీతో మిథాలీ బయోపిక్ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం సయీఫ్ అలీఖాన్ ‘ఓంరౌత్’ ప్రాజెక్టులో ఉన్నారు. ప్రభాస్ తో ఈ సినిమా పూర్తిచేయాలి. దీని తర్వాత విక్రమ్ వేద హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ తో పూర్తిచేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘ఫైర్’ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.











