కోహినూర్ వజ్రం మన దేశానికే కాదు.. మన తెలంగాణకూ ఎంతో కీర్తి తెచ్చి పెట్టింది. వజ్రాలకు నిలయమైన తెలంగాణాను వజ్రాల తెలంగాణ అనాలి. కానీ బంగారు తెలంగాణ అనే మాట రాజకీయాల్లో ఏ ముహుర్తాన వాడారో గానీ, అదే జనంలో బాగా ప్రాచుర్యంలోకి వెళ్లింది. అదికాస్త బంగారు తెలంగాణ రాష్ట్రంగా విశేషణంగా మారిపోయింది. బంగారు తెలంగాణ అనే మాట లేకుండా నాయకుల ప్రసంగాలు అస్సలు ఉండవు. అంటే దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు బంగారు తెలంగాణ అనే పేరు ఎంతలా ప్రాచుర్యమైందో. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారు తెలంగాణతో పాటూ..వజ్రాల తెలంగాణ అనికూడా పిలవాల్సి ఉంటుంది.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాల నిల్వల కోసం అన్వేషణ కొసాగుతోంది. తాజాగా కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలోని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిల్వల కోసం మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు. అలాగే వజ్రాలకు మూలమైన కింబర్‌లైట్, లాంప్రోయిట్ రాళ్ల కోసం మహబూబ్‌నగర్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సర్వే చేపట్టింది. ఈ జిల్లాల్లో గనుక బంగారు, వజ్రాల నిక్షేపాలు బయటపడితే మాత్రం ఇక నుంచి ఆ జిల్లాలు కూడా బంగారు తెలంగాణ మాదిరిగానే వజ్రాల జిల్లాలుగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తాయి. అయితే ఏ జిల్లాల్లో ఏ ఏ నిక్షేపాలు ఉన్నాయనే దానిపై అధికారులు ఇంకా ఒక స్పష్టమైన అంచనాకు రాలేదు. కొన్నినెలలుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిక్షేపాల అన్వేషణ జోరుగా సాగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో బంగారు, వజ్రాల గనుల కోసం అన్వేషణ సాగుతున్నట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి… సోమవారం లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు… ఇంకా అన్వేషణ కొనసాగుతునే ఉందని ఆయన సమాధానమిచ్చారు.
తెలంగాణలోని మొత్తం ఆరు జిల్లాల్లో బంగారు గనులతో పాటు వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వాటిని వెలికితీయాల్సి ఉంది. ఇక వాటిని వెలికి తీయడమే తరువాయి బంగారు తెలంగాణ కాస్త “వజ్రాల తెలంగాణ”గా, వజ్రాల జిల్లాలుగా మారే అవకాశం ఉందని జిల్లా వాసులు అంతా అనుకుంటున్నారు.











