ఇటీవల ‘వి’ సినిమాలో డైనమిక్ పోలీసాఫీసర్ గా అలరించిన సుధీర్ బాబు.. తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులకు పీరియాడికల్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వబోతున్నాడు. ఈ ఏడాది ‘పలాస 1978’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. సినిమా పేరు ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఒకప్పుడు వేసవిలో గోలిసోడాలు అందరి దాహం తీర్చేవి. ఆ తర్వాత కాలంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయిపోయాయి అవి. దర్శకుడు ఆ పాయింట్ తోనే నోస్టలాజికల్ కథాంశాన్ని అల్లుకున్నాడట. ఇటీవల ఈ సినిమా గురించి ప్రకటించిన మేకర్స్ ఈ రోజు ‘శ్రీదేవి సోడా సెంటర్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మోషన్ పోస్టర్ ను బట్టి చూస్తుంటే.. పల్లెటూళ్ళల్లో జరిగే తిరునాళ్ళ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. జెయింట్ వీల్, అమ్మవారి విగ్రహం, రంగులరాట్నం లాంటివి పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తూ.. ఇదొక లవ్ స్టోరీ అని చెప్పకనే చెబుతున్నాయి. అంతేకాదు.. కథానాయిక పేరు శ్రీదేవి అని ఊహించవచ్చు. ఇక సుధీర్ బాబు పేరు సూరి బాబు అని, అతడు సీరియల్ లైట్స్ అరేంజ్ చేసే యువకుడి పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. పలాస తరహాలో ఈ సినిమాని కూడా ఒక సామాజిక సమస్య కోణంలో ఆవిష్కరించబోతున్నాడని అంటున్నారు. ఇక ఇందులో కథానాయిక ఎవరు, ఇతర కేస్టింగ్ ఏంటన్న విషయాలు ఇంకా తెలియవు. ఈ సినిమా సుధీర్ బాబుకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











