ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మధుసూదన్ రెడ్డి జగన్ రెడ్డి కను సన్నల్లో ఎన్నో ఆర్థిక అవకతవకలకు పాల్పడినందున ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈయన కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా మధుసూధన్ రెడ్డి అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది.
2008 బ్యాచ్‍కు చెందిన రైల్వే అకౌంట్స్ సర్వీసు (IRAS) అధికారి మధుసూదన్ రెడ్డి. ఫైబర్ నెట్ ఎండీ స్థానంలో ఉండి ఆయన నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా నియమించారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మధుసూదన్ రెడ్డి రికార్డులను కూడా ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో చెప్పింది. సంస్థలో తన బంధువులను నియమించి వందల కోట్ల దోపిడీకి మధుసూదన్ రెడ్డి పాల్పడ్డారని భావిస్తున్నారు. ఫైబర్ నెట్ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మెటీరియల్ కొనుగోలులో కూడా గోల్‌మాల్ చేశారని అంటున్నారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఫైబర్ నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లుగా లెక్కలు చూపారు. కానీ, నిజానికి వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని ముంబయిలోని బినామీ ఖాతాలకు మళ్లించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో ప్రతి నెలా రూ.14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ.238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు బలమైన ఆధారాలను కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించారు.
2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి ఆయన డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. మధుసూదన్ రెడ్డిపై ఈ రేంజ్ లో ఆరోపణలు ఉన్నందున విచారణలో భాగంగా రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఫైబర్ నెట్‌లో అక్రమాలు జరిగినందున విచారణ చేయడం కోసం డిప్యుటేషన్‌ను ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. నిజానికి ఈ డిప్యూటేషన్ కాలం ఆగస్టు 22తో ముగియనుంది.











