వైసీపీ టికెట్ పై ఎంపీగా విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్ ను మళ్లీ జైలుకు పంపేలా వేస్తున్న అడుగులు దారి తప్పినట్లుగానే సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే కేసులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి మంజూరైన బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను ముగించిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం (ఈ నెల 15) తుది తీర్పు వెలువరించనుంది. దీంతో జగన్, సాయిరెడ్డిల బెయిల్ రద్దు అవుతందా? అన్న కోణంలో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇలాంటి కీలక తరుణంలో రఘురామరాజు మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తీర్పు వాయిదా వేయాలట
జగన్, సాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ రఘురామరాజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తన పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని ఆ పిటిషన్ లో రఘురామరాజు కోరారు. రఘురామరాజు అభ్యర్థనను మన్నించిన తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై మంగళవారం మధ్యాహ్నమే విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జగన్, సాయిరెడ్డిల బెయిళ్లను రద్దు చేయాలన్న తన పిటిషన్లను వేరే కోర్టుకు బదిలీ చేయాలని రఘురామరాజు కోరారు. అప్పటిదాకా ఈ రెండు పిటిషన్లపై తుది తీర్పు వెలువరించకుండా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తన నిర్ణయాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేసింది. అంటే.. జగన్, సాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న సమయంలోనే.. తెలంగాణ హైకోర్టు తీర్పు వస్తుందన్న మాట.
హైకోర్టు మాటే ముందు..
జగన్, సాయిరెడ్డిల బెయిళ్ల రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేయాలన్న పిటిషన్ పై హైకోర్టు తన నిర్ణయాన్ని చెప్పనున్న దృష్ట్యా.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి తన తీర్పును మధ్యాహ్నం తర్వాత వెలువరించే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు హైకోర్టు నుంచి సీబీఐ కోర్టుకు సూచన కూడా వెళ్లే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ రఘురామరాజు అభ్యర్థనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెబితే.. జగన్, సాయిరెడ్డిల బెయిళ్ల రద్దు పిటిషన్లు వేరే కోర్టుకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఫలితంగా జగన్, సాయిరెడ్దిలకు మరికొంత కాలం పాటు ఉపశమనం లభించడం ఖాయమే. ఈ లెక్కన జగన్ ను బుక్ చేసి పారేసేందుకే కంకణం కట్టుకున్న రఘురామ.. జగన్ తో పాటు సాయిరెడ్డికి ఉపశమనం కల్పించినట్టే కదా. అలా కాకుండా రఘురామ పిటిషన్ ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెబితే.. జగన్, సాయిరెడ్డిల బెయిళ్ల రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు తీర్పు చెప్పేస్తుంది. అప్పుడు వైసీపీలో టెన్షన్ మొదలవుతుంది.











