తెలుగుదేశం పార్టీలో పూర్వవైభవం తెచ్చే ఉద్దేశంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సరికొత్త కసరత్తులు చేస్తూ , పాత తరాన్ని పక్కన పెట్టి, కొత్తతరాన్ని అందలం ఎక్కిస్తుంటే సీనియర్లు ససేమిరా అంటున్నారు. తమ అసమ్మతి స్వరాలను వినిపిస్తున్నారు.
అసమ్మతి స్వరం వినిపించిన మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు
జిల్లా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పీఠం అధిరోహించాలని తీవ్రంగా ఆశించారు. తెలుగుదేశం పార్టీ ఆ పీఠాన్ని యువకుడైన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిమిడి నాగార్జునకు అప్పగించి, కె. ఎ. నాయుడును మచిలీపట్నం, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు కో ఆర్డినేటర్ గా నియమించింది. దీంతో కంగుతిన్న నాయుడు హుటాహుటిన ఆదివారం సాయంత్రం విజయనగరంలోని తన కార్యాలయంలో అనుచరులతో అంతర్గత సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానంపై తన అక్కసు వెళ్లగక్కారు. పార్టీలో సీనియర్లుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని , జూనియర్లకు అందలం ఎక్కిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పార్టీని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అదేతరుణంలో తన కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం అని బోర్డు పెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉన్నత రాజకీయ కుటుంబ నేపథ్యం
ఉన్నత రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన కె. ఎ. నాయుడు స్వతహాగా డాక్టర్. ఆయన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన మరణానంతరం రాజకీయ ఆరంగేట్రం చేసిన కె. ఎ. నాయుడు తొలిసారిగా 2009లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం అసెంబ్లీ నుండి తెలుగుదేశం అభ్యర్థి గా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 సాధారణ ఎన్నికల్లోను మరోమారు టీడీపీ అభ్యర్థిగా గజపతినగరం నుండి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు.
గంటా అనుచరునిగా గుర్తింపు
గజపతినగరం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం జిల్లా తెలుగుదేశం లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరునిగా గుర్తింపు పొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయుడు గంటాతో కలసి విజయనగరం జిల్లాలోని టీడీపీ కాపునాయకులందరునూ ఒకతాటిపైకి తెచ్చేప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే జిల్లా టీడీపీకి పెద్దదిక్కైన అశోకగజపతితో విభేదాలు నెలకొన్నట్లు గుసగుసలు వినిపించాయి.
మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం , వైసీపీ వైపు తొంగి చూస్తుండటంతో ఆ వర్గానికి చెందిన నాయుడుకు ఇక్కడ అవకాశాలు సన్నగిల్లినట్లు ఆ పార్టీ వర్గాలే బహాటంగా అభిప్రాయపడుతున్నాయి.











