టీడీపీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఆదివారం ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు అధ్యక్షులను ఎంపిక చేశాడు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ కి నూకసాని బాలాజీ, బాపట్లకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ నిర్ణయాలపై ప్రకాశం జిల్లా తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా డీలా పడ్డారు.
బాపట్ల ఎంపీ స్థానానికి ఏలూరి ఎంపికపై మిశ్రమ స్పందన వస్తుంటే.., ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షునిగా నూకసాని ఎంపికతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురైనాయి. వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి బలమైన అభ్యర్థి ఉన్న చోట.., ఆయనకు దీటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తప్పితే ఇక ఎవరూ టీడీపీ పార్టీలో లేరా? అని ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
ఒంగోలు ఎంపీ స్థానానికి అభ్యర్థులు దొరకని దుస్థితికి కారణం బాబేనా?
ఒంగోలు ఎంపీ స్థానం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి టీడీపీ పార్టీకి నేతలు కూడా దొరకని పరిస్థితికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నెల ముందు ఓ కాంట్రాక్టర్ ని లేదా పార్టీ ఫిరాయించిన నేతను తీసుకురావడం.., పార్టీపై రుద్దడం బాబుకు అలవాటుగా మారింది. అలా వచ్చిన నేతలు ఓడిపోగానే టీడీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉండి డబ్బులు సంపాయించుకోవడం, ఓడిపోతే గెలిచిన పార్టీలోకి వెళ్లి తమ ఆస్తులు కాపాడుకోవడం షరా మాములుగా మారింది. గత 10 ఏళ్ల నుంచి టీడీపీ ద్వారా అన్నివిధాల లబ్ది పొందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సైతం 2014 నుంచి 2019 వరకూ మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో ఒంగోలు ఎంపీగా పోటీచేసి ఓడిపోయి, ఆస్తులు కాపాడుకోవడానికి కుటుంబంతో సహా వైసీపీలోకి జంప్ అయ్యారు.
ఒంగోలు బాధ్యతలు తీసుకోవాలని కనిగిరి మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహా రెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై.., టీడీపీ అధిష్టానం ఒత్తిడి తెచ్చినా వారు ముందుకు రాలేదు. ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యాక టీడీపీ జిల్లా ఆధ్యక్షడు దామచర్ల జనార్దన్ కూడా జిల్లాకు ముఖం చాటేశారు. పార్టీ మీద అభిమానంతో ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకుందామని ఏ నేత అయినా ఆలోచించినా ఎన్నికలకు నెల ముందు పొత్తుల పేరుతోనో… లేక డబ్బు ఖర్చు పెట్టాలి అంటే పారిశ్రామిక వేత్త అవసరం అని మళ్లీ ఎవరో ఓ కొత్త అభ్యర్థిని బాబు ఒంగోలు ఎంపీగా నిలబెడతారు! ఎందుకొచ్చిన తలనొప్పి అని కష్ట సమయంలో బాధ్యతలు తీసుకోడానికి సీనియర్ నేతలు కూడా ముందుకు రావడం లేదు.
ఏది ఎలా ఉన్నా.. ఒంగోలు ఎంపీ స్థానానికి నూకసానిని అధ్యక్షునిగా ఎంపిక చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. 2024లో కూడా ఒంగోలు ఎంపీ స్థానాన్ని వైసీపీ ఖాతాలో బాబు వేసినట్లే అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాపట్లలో ఏలూరు నెగ్గుకు రాగలడా..?
బాపట్ల పార్లమెంట్ అధ్యక్షునిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరిసాంబశివరావును ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో పర్చూరు నుంచి ఏలూరి గెలవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ అండగా నిలబడితేనే ఏలూరి.., ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై విజయం సాధించగలిగారు. ఇప్పుడు కరణం వైసీపీలో ఉన్నారు. గొట్టిపాటి వైసీపీలోకి వెళ్తారనే వార్తలు ఉన్నాయి. వైసీపీ అధిష్ఠానం కూడా ఏలూరి ఆర్ధిక మూలాలపై దాడులు చేసి అవకాశం ఉందనే వార్తలతో ఆయన కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తన వ్యాపారాలు చూసుకునే పనిలో ఉన్నారు.
జిల్లాకు వచ్చినా పర్చూరుకే పరిమితం అవుతున్నారు. బాపట్ల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీని అభ్యర్థిని అధ్యక్షునిగా నిలిపితే పార్టీకి ఉపయోగం గా ఉంటుంది కానీ, కారంచేడు వంటి సంఘటనలు జరిగిన నియోజకవర్గంలో ఓసి అభ్యర్థిని అధ్యక్షునిగా నియమించి బాబు పార్టీ శ్రేణులకు ఇస్తున్న మెసేజ్ ఏంటో ఎవ్వరికీ అర్ధంకావడం లేదు.
పర్చూరుకే పరిమితం అవుతున్న ఏలూరు.., బాపట్లలో టీడీపీని ఎంత వరకు గట్టెక్కిస్తారో అంటే మాత్రం.., 2024 వరకు వేచి చూడాల్సిందే…!











