ధరణి పోర్టల్… ఇప్పుడు రాష్ట్రంలో ఇదే చర్చ. ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే చాలూ దీని గురించే చర్చ. అగ్రికల్చర్ భూములకే కాదు నాన్ అగ్రికల్చర్ భూములకు కూడా ధరణే ప్రాతిపదిక కానుంది. రాష్ట్రంలో భూ లావాదేవీలకు ధరణి పోర్టల్‌ను ఆధారంగా మార్చి ఈ పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజు ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ పోర్టల్ నందు 46 కాలమ్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరములను సేకరించి ధరణి వెబ్ సైట్ నందు నమోదు చేయనున్నారు.అయితే ఈ పోర్టల్‌పై ప్రభుత్వ ఉద్ధేశం ఏమైనప్పటికినీ రాష్ట్ర ప్రజల మనసుల్లో ధరణి ఆందోళన పట్టుకుంది.
సహకరించాలని మెస్సేజ్‌లు..
వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. వివరాల కోసం ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరములను తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం వ్యవసాయేతర వివరాలతోపాటు, ఇంటిపన్ను, కరెంటు బిల్లు, నీటిపన్ను రసీదులు, ఇంటి పేరుగల యజమాని ఫోటో, ఇంటి ఓనర్ గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేదా పట్టా పాస్ పుస్తకం వివరాలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, జనధన్ బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డు వివరాలు, ఆసరా పెన్షన్ వివరాలు, యజమాని ఆధార్ కార్డ్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్, ఓనర్ సెల్ ఫోన్ నెంబర్ మరియు మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు మొదలగు వివరములిచ్చి తమ సిబ్బందికి సహకరించాలని అధికారుల పేరుతో మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
బెనిఫిట్స్ కోల్పోతామా?..
అధికారులు వ్యవసాయేతర ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ని వివరాలను అసలెందుకు అడుగుతున్నారనే చర్చ జరగుతోంది. ఆస్తుల వివరాలు, వ్యక్తిగత వివరాలను అధికారులకు ఇవ్వడం వల్ల తమకు ప్రభుత్వం నుంచి అందే బెనిఫిట్స్ భవిష్యత్తులో వాటికి కోత పెట్టే ఉద్ధేశం ఏమైనా ఉందా? అని అనుకుంటున్నారు. ఊళ్లో ఉన్న ఆస్తుల వివరాలు, పట్టణంలోని చిన్న చితకా ఆస్తుల వివరాలను అధికారులకే చెబితే చెడామడా ట్యాక్సులు ఏమైనా పెంచుతారా? అని కూడా ఆందోళన చెందుతున్నారు. ఆస్తుల విరాలను లెక్కలోకి తీసుకొని రూ.లక్షల నుంచి రూ. కోట్ల వరకు వాటిని లెక్కగట్టి పన్నులు పెంచే కార్యక్రమాలు చేస్తారా? అనే భయం కూడా జనాలకు పట్టుకుంది. అలాగే అధికారులు అగిగే అన్ని వివరాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వం నుంచి తమకు అందే ఆసారా పెన్షన్‌లు ఇక ఆగిపోతాయా? ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇక కట్ అవుతుందా? ఇంటి పన్ను పెంచేస్తారా? మొత్తంగా తమకు బిలోపావర్టీ జాబితా నుంచి సంపన్నుల జాబితాలో అధికారులు చేర్చుతారా? అనే అనుమానాలు ఒక వర్గం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్‌తో అవస్థలు పడుతుంటే ఈ వివరాలన్నీ ఇచ్చేస్తే భవిష్యత్తులో ఏరకమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవ్వకుంటే ఏమవుతుంది?..
మొత్తంగా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరములను సేకరించడానికి ఇంటింటికీ వచ్చే ప్రభుత్వ సిబ్బందికి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలా? వద్దా?, ఇస్తే ఏమవుతోంది? ఇవ్వకుంటే ఏమవుతోంది? అనే రకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రజలకు వెంటాడుతున్నాయి. ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలను పొందుపర్చటం కార్యక్రమం మంచి ఉద్ధేశం అయినప్పటికినీ ప్రజలకు ఈ అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా జనం కోరుతున్నారు. అప్పుడే స్వచ్ఛందంగా ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఇచ్చేందుకు ముందుకొస్తారు. అనుమానాలను నివృత్తి చేయకుండా ఎంత మంచి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినా అది ప్రజల మన్ననలను పొందడం కష్టమే అంటున్నారు.
పెద్దల సంగతేంటీ..
నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలివ్వాలని ప్రభుత్వం అంటుంది. ఇది మంచి విషయమే. కానీ కోటీశ్వరులు తమ ఆస్తుల వివరాలు ఇవ్వడానికి ఏమేరకు ముందుకు వస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ ఆస్తుల వివరాలు అధికారులకు ఇవ్వడానికి అసలు ఇష్ట పడతారా?. బినామీ పేర్లతో కొంత మంది నేతలు ఆస్తులను మూటగట్టుకున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, బడాబాబులు తమ ఆస్తుల వివరాలను ధరణీ పోర్టల్ లో పొందుపర్చటానికి ఏ మేరకు వారు ముందుకు వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్తుల వివరాలు అందరూ ఇవ్వాలని అధికారులు చెబుతున్నా ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడాబాబులు ఏమేరకు అధికారులకు ఆ విషయంలో సహకరిస్తారనేది చూడాల్సిఉంది అని జనం అనుకుంటున్నారు.











