విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ వ్యవహారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రెండుగా విడిపోయినప్పటీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదిలాబాద్ నుంచి మొదలు..తెలుగురాష్ట్రాల్లో జరిగిన పోరాటాలను నాయకులు స్మరించుకుంటున్నారు. అదే సందర్భంలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేపట్టిన తమనపల్లి అమృతరావు పట్టుదలనూ స్మరించుకుంటున్నారు.
1950, 1960వ దశకంలో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంతో పోరాడడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో కొన్ని వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఉన్నంత వేగంగా మీడియా, సోషల్ మీడియా, కమ్యూనికేషన్స్ లేవు. రవాణా మార్గాలు కూడా అంతంతమాత్రమే. ట్రంక్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్లు, లేఖల ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు వాపపక్షాలు బలంగా ఉండడం, నాయకుల్లో పట్టుదల ఉండడం, ప్రజల్లో సదరు నాయకుల పట్ల గౌరవం, విశ్వాసం, నమ్మకం ఉండడం, పార్టీలకు అతీతంగా ప్రగతి మాత్రమే పరమావది కావడంతో కేంద్రంతో పోరాడి విజయాలు సాధించారు. ఇలాంటి పోరాటాలు తెలుగురాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేసిన తమనపల్లి అమృతరావు ధీక్షకు, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్షతో పోల్చవచ్చు. ఇద్దరూ గాంధేయ వాదులే. నిస్వార్థ పరులే.
పొట్టి శ్రీరాములు..
పొట్టి శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు, బొంబాయిలో జరిగింది. శానిటరీ ఇంజనీరింగు చదివారు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేశారు. తమనపల్లి అమృతరావు కర్నూలులోనే చదివినా వైమానిక దళంలోనూ, నిజాం స్టేట్ రైల్వేలోనూ కొన్నాళ్లపాటు పనిచేశారు. స్వాంతంత్ర్యానికి పూర్వం వీరు రైల్వోల్లోనే ఉద్యోగం చేశాని చెప్పవచ్చు. తరువాత గాంధీ మార్గంలో పయనించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో సేవలందించారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మూడుసార్లు జైలుకి వెళ్లివచ్చారు. తరువాతి కాలంలో కృష్ణా జిల్లా కొమరవోలు గాంధీ ఆశ్రమంలో చేరడం, గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1946లో నెల్లూరులో వేణుగోపాలస్వామి ఆలయంలో అణగారిన వర్గాల ప్రవేశం కోసం దీక్ష చేపట్టారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో స్వాతంత్ర్యం సిద్ధించే క్రమంలో దీక్షల వల్ల స్వాతంత్ర్యసాధన లక్ష్యం దెబ్బతింటుందని గాంధీజీ పొట్టి శ్రీరాములుని దీక్ష విరమణకు ఒప్పించాల్సి వచ్చింది. అట్టముక్కలపై తన లక్ష్యాలను వివరిస్తూ.కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి పొట్టిశ్రీరాములు. తరువాతి కాలంలో ఆయన మద్రాసులోనే ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం బలసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార ధీక్షను ప్రారంభించారు. ఎన్నో ఒత్తిళ్లు, అవాంతరాలు, ఆరోగ్యసమస్యలు వెంటాడినా.. వెనక్కి తగ్గలేదు. లక్ష్యం మరువలేదు. 1952డిసెంబరు 15న ప్రాణాలను త్యాగం చేశారు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. హింసాత్మక ఘటనలూ జరిగాయి. 1953 అక్టోబరు1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది.
తమనపల్లి అమృతరావు
తమనపల్లి అమృతరావు విషయానికి వస్తే.. ఆయన కూడా అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేశారు. నిజాం రైల్వేలో ఉద్యోగం చేసినా.. నచ్చక గాంధీ మార్గంలో పయనించారు. విద్యార్థిగా ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. గాంధీజీ సిద్ధాంతాల స్ఫూర్తిగా గాంధీజీ మిషన్ అనే సంస్థను స్థాపించారు. తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై ప్రచారం చేశారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలిసభ్యులయ్యారు. 1966అక్టోబరు 15న దీక్ష చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరు 19న దీక్ష చేపట్టగా తమనపల్లి అమృతరావు అక్టోబరులోనే దీక్ష చేపట్టారు. ఇద్దరూ అక్టోబరులోనే కేంద్రంపై పోరాటం మొదలుపెట్టారని చెప్పవచ్చు. అమృతరావు భార్యకూడా పదిరోజులపాటు దీక్షలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన దీక్ష దేశవ్యాప్తంగా ప్రకంపనలకు కారణమైంది. పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టినప్పుడు ప్రధాని నెహ్రూ కాగా.. అమృతరావు దీక్ష చేపట్టినప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ ఉన్నారు. ఇద్దరూ గాంధీ మార్గంలోనే దీక్షతోనే యువతలో చలనం తీసుకురాగలిగారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, ఉద్యమ తీరు తదితర కారణాల వల్ల కేంద్రం 1966 నవంబరులో విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకు కేంద్రం అంగీకరించింది. గుంటూరు జిల్లాకు చెందిన తమనపల్లి అమృతరావు విశాఖ ఉక్కు కంపెనీ సాధనకోసం విశాఖలోనే దీక్ష చేశారు. 1971లో విశాఖ ఉక్కు కర్మాగార పనులు మొదలయ్యాయి. తరువాతి కాలంలో వీరు 1978లో తాడికొండ నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1989 ఏప్రిల్ 27న చనిపోయారు.