బాల బ్రహ్మంగా అందరికీ కరోనా కాలంలో పరిచయమైన అభిజ్ఞ ఆనంద్ ఓ సంచలనమే. అతను ఏం చెప్పినా జరిగి తీరుతుందన్న నమ్మకం చాలామందిలో కలిగింది. అందుకేనేమో ఓ దశలో యూట్యూబ్ కూడా అతని వీడియోలపై ఓ కన్నేసింది.
అతను పోస్ట్ చేసిన వీడియోలను కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రపంచాన్ని వణికించిన ఈ ఏడు నెలల్లో అతను హీరో అయిపోయాడు. దానికి కారణం ఇలాంటి ముప్పు ఏర్పడుతుందని అతను తన వీడియోల ద్వారా ముందే హెచ్చరించడమే. ఎవరికైనా యూట్యూబ్ ఛానెల్ ఉంటే సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోడానికి వారు నానా తిప్పలు పడుతుంటారు. అలాంటిది అతని యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ అమాంతం లక్షల్లో పెరిగారంటే అతని ప్రభావం ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
అతని యూట్యూబ్ ఛానెల్ పేరు కన్ సైన్స్. ఈ ఛానెల్ తో అతను అతి పెద్ద రికార్డును సృష్టించాడు. అతి తక్కువ కాలంలో ఈ ఛానెల్ ఒక మిలియన్ సబ్ స్క్రైబర్స్ మైలు రాయిని చేరుకుంది. కన్ సైన్స్ అంటే అంతరాత్మ. అతను ఈ ఛానెల్ ను 2012 జులై 30 ప్రారంభించాడు. అంటే అప్పుడతనికి ఏడేళ్ల వయసే. అప్పటి నుంచి ఆ ఛానెల్ ఏదో ఒకటి పోస్టు చేస్తూ వస్తున్నా మార్చి నెలలో ఆ ఛానెల్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎందుకో తెలుసా కరోనా గురించి అతను దాదాపు ఏడాది క్రితం అతను పోస్టు చేసిన వీడియో.
ఆ వీడియో ఈ ఏడాది మార్చి నెలలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికి ఆ వీడియోను 7.9 మిలియన్ల మంది చూశారంటే ఆశ్చర్యంగా లేదూ. మార్చిలో 2 లక్షల్లో ఉన్న అతని కన్ సైన్స్ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ అమాంతం పెరిగిపోవడం ప్రారంభించారు. అది ఎక్కడిదాకా అంటే ఈ ఎనిమిది నెలల కాలంలో 10 లక్షలమంది సబ్ స్క్రైబర్లకు చేరిపోయారు. ఇప్పటిదాకా అతను పోస్టు చేసిన వీడియోలను ఎంత మంది చూశారో తెలుసా? దాదాపు ఆరు కోట్ల మంది అతని వీడియోలను చూశారు. ఈ చూసిన వారంతా గత మార్చి నుంచి ఇప్పటిదాకానే.
అభిజ్ఞ ప్రత్యేకత ఏమిటంటే?
పూర్వజన్మ సుక్రుతం ఉంటేనేగాని అభిజ్ఞ లాంటి పిల్లలు పుట్టరు. ఈ కుర్రాడు పధ్నాలుగు ఏళ్లకే జ్యోతిష శాస్త్రాన్ని క్షణ్ణంగా నేర్చుకున్నాడు. అతని పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.‘జ్ఞ’ అంటే తెలుసుకోవడం, తెలుసుకున్నవాడు అని అర్థం. ‘అభిజ్ఞ’ అంటే విశేషంగా తెలుసుకోవడం, పండితుడు అన్నమాట. అలా తన పేరును కూడా అతడు సార్థకం చేసుకుంటున్నాడు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం అభిజ్ఞ సొంతూరు. 2006లో ఆనంద్ సుబ్రమణియన్, అన్నూ ఆనంద్ దంపతులకు ఈ కుర్రాడు జన్మించాడు. అభిజ్ఞ కు ఓ చెల్లెలు కూడా ఉందండోయ్. ఆమె పేరు అభిదేయ ఆనంద్.
చిన్న వయసులోనే కొడుకు ప్రతిభాపాటవాలను గమనించిన తల్లితండ్రులు ఆ దిశగా అతన్ని ప్రోత్సహించారు. మూడేళ్ల వయసు నుంచే సంస్కృతం నేర్పించారు. ‘దివ్యజ్యోతి కాలేజ్ ఆఫ్ ఆస్ట్రాలజీ’లో కూడా చిన్న వయసులోనే చేరాడు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ మైక్రో బయాలజీలో 96 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. ఆ కోర్సు చేసిన అతి చిన్న వయసువాడు అభిజ్ఞేనని చెప్పాలి. ఇప్పుడు ఈ పిల్లాడి వయసు కేవలం పదేహేనేళ్లు. ప్రస్తుతం గుజరాత్‌లోని ‘మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయం’ ప్రొఫెసర్ గానూ ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంత చిన్న వయసులో ఈ పదవిని చేపట్టడం సాధారణ విషయం కాదు. అంతేకాదు ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్‌డీ డాక్టరేట్ కూడా పొందాడు. వాస్తులోనూ అతనికి నైపుణ్యం ఉంది. ‘విశ్వమ్ వాస్తుమయం’ పేరుతో వెబ్ పోర్టల్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఓ పక్క ఉద్యోగం.. ఇంకో పక్క విద్యార్థులకు జ్యోతిష పాఠాలు.. మరో పక్క తనకు తెలిసిన అంశాలతో వీడియోలు చేసి జనానికి అందించడం.. ఎప్పుడూ అతను ఖాళీగా ఉండడు.
ఇంతకీ అభిజ్ఞా ఆనంద్ ఏం చెప్పాడు?
ఇప్పుడు ఆ సంగతే చూద్దాం. మార్చి నెలలో ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతలా వణికించిందో అందరికీ తెలుసు. ఈ సమయంలో ‘పోతులూరి వీరబ్రహ్మంగారు అలా చెప్పారు… బాబా వంగా ఇలా చెప్పారు’ అనే మాటలు ఎక్కువగా వినిపించాయి. అయితే వారు మన మధ్య లేరు ఉన్నది అభిజ్ఞ లాంటి వారు మాత్రమే. ఇలాంటి విపత్తు ఒకటి ముంచుకొస్తుందని దాదాపు ఏడాది క్రితం అతను తన వీడియోల ద్వారా హెచ్చరించాడు. గ్రహ స్థితులను అనుసరించి ఈ ఫలితాన్ని చెప్పాడు. ‘2019 నవంబర్ నుంచి 2020 మే నెలాఖరు వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వైమానిక, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
చైనాలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయి. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలుంటాయి. మకర రాశిలో గురు, కుజ, శని ఒకే రేఖలో ఉండటం… మిథునంలో రాహువుతో చంద్రుడు చేరడం ఇందుకు కారణం’ అని అభిజ్ఞ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇంకా దాని గురించి వివరిస్తూ… ‘చంద్రుడు.. నీరు, రాహువు అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ. తుమ్ములు, దగ్గులకు ఈ కలయిక కారణమవుతుంది’ అని కూడా పేర్కొన్నాడు. అతడు చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో ప్రపంచం నివ్వెరపోయింది. దీంతో అభిజ్ఞ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొట్టేశాయి.
యూట్యూబ్ కూడా అతని వీడియోల మీద ఓ కన్నేసింది. అలా అతని రెండు వీడియోలను తొలగించింది కూడా. అతను జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని యూట్యూబ్ భావించింది. అతను తన వీడియోల్లో కరోనా అనే పేరును ప్రస్తావించకపోయినా ‘బయోవార్’ లాంటి పదాన్ని వాడాడు. నిజానికి అభిజ్ఞ అనే కుర్రాడు ఇవాళ కొత్తగా పాపులర్ కాదు. పదేళ్ల వయసులోనే అతను భగవద్గీతలోని ఏడొందల శ్లోకాలను అనర్గళంగా చెప్పినప్పుడు కూడా అతని పేరు మార్మోగింది. రెండున్నరేళ్ల వయసులో 50 రకాల కార్ల మోడళ్లు, 40 దేశాల జెండాలు చెప్పి జనాన్ని ఆశ్చర్యపరిచాడు. మరో విషయం ఏమిటంటే కరోనా ఎప్పుడు బలహీన పడుతుందో కూడా అతను తన వీడియోలలో చెప్పాడు. అతను చెప్పిన సమయం నుంచే కరోనా బలహీనమవడం ప్రారంభించింది.
ముఖ్యంగా బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో కూడా అతను చెబుతుంటాడు. దీని మీద కూడా అతను బాగా అధ్యయనం చేశాడు. జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెబుతాడు అభిజ్ఞ. అపార విషయ పరిజ్ఞానం అతడి గొప్పతనం. కొందరు ప్రముఖ జ్యోతిష్కులు అతడిని పరిశీలించి అతడిలో ప్రతిభా పాటవాలు వాస్తవమని ప్రకటించారు కూడా. కరోనా మీద అతను రూపొందించిన దాదాపు 10 వీడియోలు వైరల్ గా మారాయి. యూట్యూబ్ నిబంధనల కారణంగా అతను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోలు రూపొందించాల్సి వస్తోంది.
– హేమసుందర్ పామర్తి