యంగ్ హీరో రామ్ పోతినేని, దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతోందనే వార్త ఈ మధ్య కాలంలో ఫిలింనగర్ లో బాగా చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ తొలిదశలో బాగా ఎంకరేజ్ చేసింది రామ్ పెద్ద నాన్న, నిర్మాత స్రవంతి రవికిశోర్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు సినిమాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. అంతేకాదు త్రివిక్రమ్ ని నమ్మి మొట్టమొదట ‘నువ్వే- నువ్వే’ సినిమాతో డైరెక్టర్ ని చేసింది కూడా రవికిశోర్. అందుకని ఇరవై ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ రామ్ పోతినేనికి సినిమా చేసి రవికిశోర్ పట్ల తనకి ఉన్న కృతజ్ఞతను తీర్చుకుంటాడని చాలామంది భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆందోళన పడుతున్నారు. త్రివిక్రమ్ ఎక్కడ తమ హీరోకి రాసిన కథ రామ్ పోతినేనితో చేసేస్తాడేమోననేదే ఆ ఆందోళన. లోగడ రెండుసార్లు రామ్ పోతినేని కోసం రెడీ అయిన స్క్రిప్టులు ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లిపోయాయి. ‘ఊసర వెల్లి’స్క్రిప్ట్ మొదట వక్కంతం వంశీ రామ్ కోసమే రాశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి. రామ్ పోతినేని, జెనీలియా జంటగా ‘టామ్ అండ్ జెర్రీ’ పేరుతో ఓపెనింగ్ కూడా చేశారు . అయితే కారణాలు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ అనే డైరెక్టర్ ‘రభస’ కథ రామ్ పోతినేని కోసమే రాశారు. అయితే ఆ సినిమా కూడా ఎన్టీఆర్ చేశారు.
రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒకవేళ రామ్ చేసి ఉంటే ఏమయ్యేదో తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం రాసిన కథను త్రివిక్రమ్ రామ్ తో చేస్తున్నాడని రామ్ అభిమానులు ఊహించుకుంటున్నారు. గతంలో తమ హీరో కథలు ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లిపోయాయని, ఇప్పుడు మంచి కథ తమ హీరో దగ్గరకి వచ్చిందని అభిమానులు ఆశ పడుతున్నారు. నిజానిజాలు త్రివిక్రమ్ కి మాత్రమే తెలుసు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఉంటే ఎప్పటి నుంచి అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.