ఏపీలో రెండేళ్ల జగన్ పాలనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.జగన్ ప్రభుత్వానికి జేసీబీ,ఏసీబీ,పీసీబీగా నామకరణం చేశారు.ట్యాగ్‍లైన్‌గా సీఐడీ పెట్టారు.జేసీబీలతో టీడీపీ నేతల ఆస్తులను కూల్చివేయడం,ఏసీబీలతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయించడం,జేసీబీలతో కూల్చివేత కుదరకపోతే పీసీబీతో కంపెనీలు మూయించడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.టీడీపీ నేతలపై సీఐడీతో అక్రమ కేసులు బనాయిస్తూ,ప్రతిపక్షనాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆయన విశాఖలో ధ్వజమెత్తారు.
ఏపీకి రాజధాని ఎక్కడ..?
రెండేళ్ల జగన పాలనలో ఏపీ రాజధాని కూడా ఎక్కడో తెలియకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.జగన్ అసమర్థత వల్ల రెండేళ్లలో పోలవరం పనులు రెండు శాతం మాత్రమే జరిగాయని ఆయన గుర్తు చేశారు.చంద్రబాబు హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500కు అమ్మితే రెండేళ్లలో రూ.5 వేలు చేశారని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.తాజాగా ఇప్పుడు ఇసుకను ప్రైవేటు కంపెనీకి అప్పగించారని,జేపీ కంపెనీ ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు.వైసీపీ మ్యానిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధమని ప్రకటించి,ఇప్పుడు మద్యం 3 రెట్లు పెంచి జగన్ వ్యక్తిగతంగా ప్రజలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా అంటూ ప్రజలను రెచ్చగొట్టిన జగన్ కేసులకు భయపడి ప్రధాని మోదీ వద్ద మోకరిళ్లారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.