ఆమె కేవలం నటి మాత్రమే కాదు… బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. ఓ వైపు నటన, మరో వైపు మహిళా హక్కుల కోసం పోరాట పటిమ, ఇంకో వైపు రాజకీయాలు, క్రీడలు… ఇలా ఒక్కటేమిటి… అన్నింటా ఆమే. ఇప్పుడీ సినీ నటి పేరు వింటేనే రెబెలిస్టు గుర్తుకొస్తుంది. వివాదాలు ఆమె దగ్గరికి వెళతాయో, ఆమె తానుగానే వివాదాల జోలికి వెళుతుందో అర్థం కాదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాదిరిగానే రకరకాల ట్వీట్లు చేస్తూ వాటిలో తరచూ ఇరుక్కుంటూ ఉంటుంది కస్తూరి శంకర్. ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ ‘భారతీయుడు’, ఓ ‘అన్నమయ్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘ది లియో న్యూస్’ తో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలేంటో చూద్దాం. ఆమె పూర్తి ఇంటర్వ్యూని మా యూట్యూబ్ ఛానెల్ లోనూ వీక్షించవచ్చు.
నాటి భారతీయుడు నుంచి ఈనాటి డాన్ శీను వరకు ఇంత అందాన్ని ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారు?
మీరు అందం అన్నారు కదా… దానికి థ్యాంక్యూ చెబుతున్నా.. ప్రతివారూ అందంగానే ఉంటారు.. దేవుడి సృష్టిలో అన్నీ అందమైనవే… ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అయినా బయటి అందాన్ని కాదు మన లోపలి అందాన్ని చూడాలి. ఫిట్ నెస్ విషయంలో నేను కాస్త జాగ్రత్తలు తీసుకుంటా.
అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్టున్నారు?
మిస్ మద్రాస్ అయ్యా 1992, మిస్ ఇండియా ఫైనలిస్టులో ఉన్నా. ఐశ్వర్యారాయ్, సుస్మితల దగ్గర ఓడిపోయా?
మీరు తమిళ అమ్మాయా?
అవును తమిళ అమ్మాయినే. నా పార్టనర్ మాత్రం తెలుగు. నా లైఫ్ పార్టనర్ ది విజయవాడ. పంపిణీ రంగంలో ఉండేవారు. అలా తెలుగుతో మాట్లాడటం మొదలుపెట్టా. నాకు తెలుగంటే చాలా ఇష్టం. ఆ సాహిత్యం, సంగీతం, పద్ధతి బాగా ఇష్టం. వచ్చే జన్మ ఉంటే తెలుగులోనే పుట్టాలనుకున్నా. నా అదృష్టం బాగుండి తెలుగువారి ఇంటిలోనే చేరా. తమిళియన్ గా గర్వపడుతున్నా. తెలుగు కల్చర్ అంటే ప్రేమ.
మీ బాల్యం ఎలా గడిచింది?
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరస్వతి, లక్ష్మి ఎప్పుడూ ఒకేచోట ఉండవు. చదువులో నేను అన్నీ ఫస్టులే. ఐఏఎస్ అవుతానని అందరూ అనుకున్నారు. మా అమ్మ లాయర్. అందుకే లా చదువుకున్నా.
బాగా చదువుకున్నారు కదా సినిమాల్లోకి ఎందుకొచ్చారు?
మోడలింగ్ ఫీల్డులో ఉన్నవారికి అవకాశాలు ఈజీగా వస్తాయి. సినిమానా అయ్యో వద్దు అనేవారు. గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు యాంకరింగ్ కోసం వెళ్లాను. చిన్నప్పుడు దూరదర్శన్ లో పిల్లల ప్రోగ్రామ్ కు యాంకరింగ్ చేసేదాన్నికాబట్టి ఆ అవకాశం వచ్చింది. సినిమా అంటే అప్పుడు నా ఆలోచన మారింది. నాకూ అవకాశం వస్తే సినిమాలు చేయాలనుకున్నా. ముఖ్యంగా భరతన్ సినిమాలు చూసి లవ్ లో పడ్డాను. కానీ ఆయనతో మాత్రం కాదు ఆయన సినిమాలంటే అంత ఇష్టం. ఇంతవరకు ఆయన సినిమాలో చేసే అవకాశం రాలేదు.
మొదటి సినిమాలో మీ పాత్ర?
పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. అమ్మ గుడిలో అనే పాత్ర.. ఆ అమ్మనేనే.
‘భారతీయుడు’ అవకాశం ఎలా వచ్చింది?
నా అదృష్టం. మొదట ఊర్మిళ చేసే పాత్రకు నన్ను తీసుకున్నారు. అదే రోజే రంగీల సినిమా విడుదలైంది. దాంతో నా పాత్ర మారింది. ఏ పాత్ర అయినా కమల్ తో అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రతి రోజూ రెహమాన్ పాటలు వింటూ ఉండే టైమ్ లో ఆ అవకాశం వచ్చింది.
వాళ్లు సెట్ లో ఎలా ఉండేవారు?
స్కూలు కు వెళ్లినట్లు ఉండేది. అందరూ చాలా నేర్పారు. కమల్ గారు ట్రిక్స్ చాలా నేర్పారు. చిన్నచిన్న విషయాలు నేర్పించారు. ప్రతి సినిమా నాకు ఒక పాఠమే.
భారతీయుడులో మీది కీరోల్ … మీ పాత్ర అందులో అయిపోతుంది.. భారతీయుడు 2లో ఏమైనా ఆఫర్ వచ్చిందా?
దానికీ దీనికీ పోలిక లేదు. అందుకే అవకాశం రాలేదేమో.
తెలుగులో ఐదు సినిమాలు చేశారు కదా… ఇందులో మీకు నచ్చిన హీరో ఎవరు?
నాగార్జున గారు… ఈ ఐదు సినిమాలే కాదు. ఆయనతో నటించాలి అనేది ఒకటే కల. ఆయన స్టయిల్ ఇష్టం.. హ్యాండ్ సమ్ హీరో. ఆయన బ్రెయినీ హీరో. ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదివే వ్యక్తి. షూటింగ్ చేసినప్పుడు రాత్రంతా పేపర్ చూసేవారు.
‘అన్నమయ్య’ లో నాగ్ చెయ్యి ఇస్తే… ఏదో చేశారట?
ఆ చేతిని కడగనే లేదండీ. ఆయనంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఆకాశ వీధిలో చేశాను కానీ ఆయన పక్కన మాత్రం రవీనా నటించింది. నాగార్జున గారి కోసమే బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఉంది. స్పెషల్ గెస్ట్ గా నన్ను వారం పంపితే ఆనందిస్తా.
క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ ఒపీనియన్?
మీటూ మూవ్ మెంట్ కేవలం సినిమాల గురించే కాదు. ఎక్కడైనా మహిళలకు వేధింపులు ఉంటాయి. మహిళల హక్కుల కోసం పోరాడుతున్నా. బయటి స్టోరీలు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్లను ఫోర్స్ చేయడం అనేది కరెప్షన్ లాంటిది. సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ 200 శాతం కావాలసిందే. ఆడవాళ్ల బలహీనత ఉంటే దానికి సినిమాలెందుకు తీయడం… వేరే దారులు కూడా ఉన్నాయి.
సినిమా రంగంలో కమిట్ మెంట్ గురించి డైరెక్టుగా అడుగుతారట కదా?
అలా చెప్పేవాళ్లని అడగొచ్చు కదా. డబ్బులిచ్చి పనిచేసేవారు చేయించుకునే వారు ఉన్నారు. షార్ట్ కట్ లు పనికి రావు. టాలెంట్ ఉంటే ఎప్పుడైనా పైకొస్తారు. మిమ్మల్ని ఎవరైనా అడగారా?
నేను అబ్బాయిని కనుక నన్ను ఎవరూ సెక్సువల్ హెరాస్మెంట్ చేయరు.
మీరు ఎవరినైనా హెరాస్ చేశారా?… మీలాంటి మంచి వాళ్లు చాలా మంది సినిమా రంగంలో ఉన్నారు. అవకాశాలు రావాలి అంటే అదృష్టం ఉండాలి… ఓపిక ఉండాలి. నిన్ననే నాకు ఓ సినిమా అవకాశం వచ్చింది.. ఈరోజు అది పోయింది. అంత మాత్రాన నేను నిరుత్సాహ పడితే ఎలా? స్టార్ డమ్ అనేది బెడ్ రూమ్ ల నుంచి రాదు. నెపోటిజం అనేది వేరే రంగాల్లో ఏమో గాని సినిమా రంగానికి మాత్రం పనికి రాదు. ఎవరి అబ్బాయి అయినా ఎవరి అమ్మాయి అయినా టాలెంట్ ను బట్టే. జనానికి నచ్చాలి. జనానికి నచ్చకపోతే ఎవరూ సక్సెస్ కాలేరు.
ఒకప్పుడు హీరోయిన్లను కొలతలు చూసి సెలెక్ట్ చేసేవారట కదా?
కొలతలు మీన్స్?… నేను వినలేదు. నా గురించి వందల గాసిప్స్ వచ్చాయి. అందులో ఒక్కటి కూడా నిజం కాదు. నిజమైనవి ఏమీ బయటికి రాలేదు. ఇది కూడా అలాంటిదే.
అలాంటి గాసిప్స్ ఏమైనా చెప్పండి?
నాకొక డైమండ్ నెక్లెస్ ఇచ్చారు ఒక హీరో అని రాశారు. ఆ హీరోతో నేను మూడు సినిమాలు చేశాను. ఆల్రెడీ రాసేశారు… నిజం చేసేద్దాం అన్నా. డైమండ్ నెక్లెసే అడిగా… ఆ హీరో ఇచ్చారు. ఇంకా పెద్ద గాసిప్ అయితే తమిళనాడులో పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను ఉంచుకున్నారు అని రాశారు. ఆయనను నేను ఎప్పుడూ చూడను కూడా లేదు. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళితే ఆయన్ని కలిశాను. పక్కనే ఆయన భార్య కూడా ఉంది. ‘సర్ నమస్తే … మీవల్ల నాకు చాలా మంచి జరిగింది’ అని చెప్పాను. ఆయన చాలా ఎంబరాస్ అయిపోయారు.
నెక్లెస్ ఇచ్చిన ఆ హీరో ఎవరో చెబుతారా?
ఆ హీరో ప్రభు గారు.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కదా… స్పందన ఎలా ఉంది?
చాలా సరదాగా ఉందండీ. జీవితంలో అన్నీ చూశాను. మొదట్లో అమాయకత్వం ఉండేది. అన్నీ ఈ రంగంలోనే నేర్చుకున్నా. సినిమాలే నా యూనివర్శిటీ. కొన్ని గుణ పాఠాలు కూడా నేర్చుకున్నా.
మొదట్లో అమాయకంగా ఉన్న కస్తూరి ఆ తర్వాత రెబల్ గా మారింది ఎందుకు?
నేను ఎప్పుడూ రెబలే. అప్పుడు మాట్లాడటం తెలియదు… ఇప్పుడు మాట్లాడటం వచ్చింది. నాకేమనిపిస్తే అది ఇప్పుడు చెప్పేస్తా.
అజిత్ ఫ్యాన్స్ తో మీకొచ్చిన గొడవ ఏమిటి? అసలు ఆయన అభిమానులతో మీరెందుకు పెట్టుకున్నారు?
సోషల్ మీడియాలో వారు చాలా చీప్ గా బిహేవ్ చేశారు. వారు చెత్త చెత్త మాటలు మాట్లాడతారు. సోషల్ మీడియాలో ఆడవాళ్లకు ఈ హెరాస్మెంట్ చాలా ఉంది. ఇలాంటి డర్టీ ఫ్యాన్స్ వల్ల అందరికీ పరువు పోతుంది. లూజ్ కామెంట్లు ఇవ్వడం మంచిది కాదు. నేను ఊరుకునే రకం కాదు కాబట్టి అడిగాను. నేను అజిత్ ఫ్యాన్ ని కాబట్టి నేను దాన్ని తట్టుకోలేను. ఆయన పర్ ఫెక్ట్ జంటిల్మన్.
దీని మీద ఆయన రియాక్షన్ ఏమిటి?
ఆయన ఏమీ పట్టించుకోలేదు. అది సినిమా రంగం సమస్యగా కూడా మారింది. ఇప్పుడు ఇంకో అమ్మాయిని షేమ్ చేశారు. నేను ఆయనను ఈ విషయంలో సంప్రదించలేదు.
హీరోయిన్ లత విషయంలో ఏంజరిగింది?
అదంతా అయిపోయింది. ఆమె మా ఇంటి పక్కనే ఉంటారు. అది సమసిపోయింది.
ఈ మధ్య రజనీ మీద కూడా ఏదో అన్నట్టున్నారు?
ఆయన రాజకీయాలలోకి రావాలనుకున్నారు. నాతో కలిసి వస్తానన్నారు. తమిళనాడు జనాలకు ఏమైనా చేయాలని ఉందన్నారు. రెండేళ్లయినా ఇంకా ఏమీ చెప్పటం లేదు. కమల్ వచ్చేసి ఒక ఎన్నికలు కూడా చూశారు. రజనీ వస్తే సీట్లు గెలవడానికి ఆయన బలం సరిపోదు. అలయెన్స్ తో వస్తే అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. 10 శాతం ఓట్లు మాత్రమే ఆయనకు వస్తాయి. అది గెలుపునకు సరిపోదు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువే. నటన వేరు, రాజకీయాలు వేరు అని ఇక్కడ తెలిసింది. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందా?
ఎవరు వచ్చినా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో దాన్ని బట్టే గెలుపు ఉంటుంది. ఆయన అభిమాన సంఘాలు మంచి పనులు చేస్తున్నారు.
కొంతమంది హీరోయిన్లు మీడియాకి పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి కదా?
ఇది ఏ లాజిక్ అండీ. సినిమాల్లో అమ్మోరిగా నటించేవారి దగ్గరికి వెళ్లి మీరు మొక్కుకుంటారా ఏమిటి? ఈ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. అలా అయితే ఆ నటులంతా గుడిలోనే ఉండాలి కదా… ఎందుకు లేరు. విజయశాంతి అయితే కాప్ అని నేను కూడా నమ్మాను.
అన్నాడీఎంకేకి ఎందుకు చెడ్డపేరు వస్తోంది?
కరోనా వచ్చిన కొత్తలో బాగానే చేశారు. తర్వాత కరప్షన్ ఆరోపణలు వచ్చాయి. పీపీఈ కిట్స్ లో కరప్షనా అని జనం అన్నారు. ఇంకోటి ఏఐడీఎంకేకి మెజారిటీ ఓటర్లు లేడీసే. అక్కడ మందు తెరవడంతో ప్రభుత్వం మీద జనానికి అపనమ్మకం వచ్చింది.
ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారులు లేకపోవడం వల్లే ఏఐడీఎంకేకి ఈ దుస్థితా?
జనాల్లో మనకు మంచి పేరుంటే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టు లెందుకు? ఆయనకు ఇచ్చే 250 కోట్లు జనం కోసం ఖర్చుపెట్టి ఉంటే ఈజీగా గెలిచేవారు కదా. రాజకీయాలంటే బిజినెస్సా?
మీరు రాజకీయాల్లోకి వస్తున్నారనుకోవచ్చా?
ఇప్పుడున్న రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లోకి వస్తే చేయలేకపోతాం. పరిస్థితులు అలా ఉన్నాయి. అందరూ డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది నా నమ్మకం. ఆఫర్స్ ఉన్నా అంగీకరించడం లేదు. నేను కూడా ఆలోచిస్తున్నా… పదవుల కోసం మాత్రం కాదు. ఇప్పుడు ఒంటరిగా పోరాడుతున్నా వ్యవస్థగా పోరాడితే కచ్చితంగా బాగుంటుందనుకుంటే వస్తా.
కరోనా టైమ్ లో మీరు ట్వీట్ చేశారు పారాసిట్మాల్ గురించి … అది ఎవరి గురించి?
జగన్ గారు కరోనాని చాలా ఈజీగా తీసుకున్నారు. ఆయన కరోనాని అండర్ ఎస్టిమేట్ చేశారు. అలా కేసీఆర్ గారు చేయలేదు. అప్పుడది చాలా షాకింగ్ న్యూస్. ఇప్పడేమో వారు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. కరోనాని ఇక్కడ లైట్ తీసుకుంటున్నట్లు కూడా నాకు అనిపిస్తోంది. తమిళనాడు జనాలు ఇంకా కరోనాకి భయపడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉందేమో అనిపిస్తోంది.
జగన్ మీద మీరు ట్వీట్ చేస్తున్నారంటే చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారని జనం అనుకుంటారేమో కదా?
నేను తెలుగు పొలిటిషియన్ కాదు… నాకు ఒపీనియన్ ఉంది కానీ ఒక పార్టీ మాత్రం కాదు. నాయుడుగారంటే నాకు చాలా అభిమానం ఉంది. దాని కోసం జగన్ గారి మీద కామెంట్ చేయలేదు. ఇక్కడ ఎక్కడ చూసినా నాయుడు గారు చేసిన అభివృద్దే కనిపిస్తోంది. హైదరాబాద్ చూస్తే ఫారిన్ సిటీ లానే ఉంది. దానికి కారణం చంద్రబాబు గారే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
జగన్ గారి మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం?
ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను దాన్ని సపోర్ట్ చేయలేను. కరోనా ఆంధ్రాలో అంత ఎక్కువగా ఉందంటే మొదట్లో ఆయన కరోనాని అండర్ ఎస్టిమేట్ చేశారు… ఇంతగా పెరగటానికి అది కూడా ఒక కారణమేమో అని నాకు అనిపిస్తోంది.
మూడు రాజధానులు అధికార వికేంద్రీకరణే కదా… ఇది మంచిది కాదంటారా?
నాకేమో అలా అనిపించడం లేదు. అభివృద్ధి చేయండి సార్. ఇప్పుడు ముంబయి ఏమీ ఇండియాకు కేపిటల్ కాదుగదా. ముంబయి డెవలప్ మెంట్ ఏమైనా తగ్గిపోయిందా ఏమిటి? డెవలప్ మెంట్ కూ రాజకీయాలకూ సంబంధం ఏమిటండీ. ఇన్ని రోజులు డెవలప్ చేయకుండా ఇప్పుడు కేపిటల్ చేయగానే అది డెవలప్ అవుతుందా? ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు.
తమిళనాడులో కూడా ఇలాంటి ప్రపోజల్ వచ్చినట్టుంది కదా?
అవును వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే అలాంటి ప్రపోజల్ ఇచ్చేవారు ఎవరంటే రాజకీయ నాయకులే… అందుకే అక్కడ వివాదం వచ్చింది. మధురై, తిరుచ్చి, కోయంబత్తూర్ లను కేపిటల్ ను చేయాలా అనేది అక్కడి వివాదం. న్యూయార్క్ అమెరికాకు కేపిటల్ కాదే. వైజాగ్ రాజధానిగా కాకుండా కూడా డెవలప్ అయ్యింది కదా. అమరావతి ఇంకా డెవలప్ అవలేదు కదా. అధికారంలోకి రాగానే ఇలా రాజధానిని మార్పు చేయడం ఎందుకు? స్టెబిలిటీ ఉంటేనే డెవలప్ మెంట్ వస్తుంది. ఒక చోటులో చేయలేని విషయాలు ఇంకా రెండు చోట్ల ఎలా చేయగలరు అని నాలాంటి వాళ్లకు అనిపిస్తుంది.
ఒక రాజధాని ఉంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని టాక్ వచ్చింది. మూడు రాజధానులైతే ఇంకా ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చని మీరనుకుంటున్నారా?
ఎవరు చేస్తారు అన్నదే కదా పాయింట్… మీ ప్రశ్నలో నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ఒకరు చేసేశారు బిజినెస్… ఇంకా వేరేవాళ్లు చేసుకోవాలి కదా బిజినెస్… దానికి అవకాశాలు మనం క్రియేట్ చేస్తున్నాం అన్నట్లుంది.
ప్రభుత్వాలన్నీ సంపద పంపిణీకే తప్ప సంపద సృష్టి మీద ఎందుకు ఆసక్తి ఎందుకు చూపటం లేదు?
ఈ రెండూ రెండు మార్గాలండీ. సోషల్ అండ్ ఎకనామికల్ అప్రోచెస్.. ఈ మార్గాలూ సరైనవే. మన కోసం సంపద సృష్టించుకుంటున్నాం అనుకోకుండా జనానికీ, మన రాష్ట్రానికీ సంపద సృష్టించుకోవాలి అనే దృష్టి ఉండాలి. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన అభివృద్దిని కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారు.