కీసర ఏసీబీ కేసులో ఏం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకోగా .. అదే కేసులో మరో వ్యక్తి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస ఆత్మహత్యలకు కారణాలేంటి. పరువు పోయిందనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేక ఇవి ప్రేరేపిత ఆత్మహత్యలా అన్నది అంతు చిక్కడం లేదు. అసలు కీసర ఏసీబీ కేసులో వెనుక ఉన్న రహస్యాలేంటి .
ఆత్మహత్యల పరంపర
మాజీ ఎమ్మార్వో నాగరాజు కేసులో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆయన జైలులోనే ఆత్మహత్య చేసుకోగా .. తాజాగా మరో నిందితుడు ధర్మారెడ్డి బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. దీంతో కేసు రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది. జైలులో ఉరేసుకున్న నాగరాజు మృతిపైనే ఇప్పటికీ అనుమానాలు వీడలేదు. ఇదే కేసులో మరో వ్యక్తి చనిపోవడంతో అసలు ఏం జరుగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎమ్మార్వో ఆత్మహత్యలో అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన కూతురు గతంలోనే హెచ్చార్సీని ఆశ్రయించగా విచారణ సాగుతోంది. జైలులో ఉన్న వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకోగలడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తోటి ఖైదీలు ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని ఎందుకు ఆపలేదన్నది ఇప్పటకీ అంతుచిక్కని ప్రశ్నే. మరోవైపు తన తండ్రి ఆత్మహత్య వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ ఆత్మహత్య వెనుక జైలర్ హస్తం ఉందని.. కొంత మంది పోలీసులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్నది ఆమె ఆరోపణ . ఈ కేసులో ఏసీబీకి పట్టుబడ్డ నాగరాజు విచారణ సందర్భంగా ఓ కలెక్టర్, ఆర్డీవోలు కూడా ఉన్నారని, ఇతని ద్వారా అనేక మంది ఆధికారులు కోట్లను కూడబెట్టారని వార్తలు వచ్చాయి. కేసు విచారణలో మొదటి నుండి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వారు కాదని.. ఆయనను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పి రాజకీయ హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.
తండ్రికి బెయిల్.. కొడుక్కి నో
తాజాగా ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఒక ఏసీబీ కేసులో ఇద్దరు ముద్దాయిలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధర్మారెడ్డి అతి కష్టం మీద బెయిల్‌పై బయటికి వచ్చాడు. వచ్చిన మరుసటి రోజే ఉరేసుకున్నారు. ఈ కేసులో మరో ముద్దాయి ఈయన కుమారుడు ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు. ఇద్దరు ముద్దాయిల్లో ఒకరికి బెయిల్ రావడం.. మరొకరికి బేయిల్ రాక పోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కూడా ఎవరి ప్రమేయంతో అయినా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. ముద్దాయిగా ఉన్న వ్యక్తులు … అది కూడా ఏసీబీ కేసులో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏముంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగరాజు కుమార్తె చేసిన ఆరోపణలే నిజమా.. ఈ ఆత్మహత్యల వెనుక నిజంగా అధికారులు.. రాజకీయ నేతల ప్రమేయం ఉందా. ఉంటే.. ఆ నేతలెవరు… నాగరాజు, ముద్దాయి చనిపోవడం వెనుక కేసును మూసి వేసే కుట్రలు జరుగుతున్నాయా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే, ఇందులో పోలీసుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రత్యేకంగా ఈ ఆత్మహత్యల మిస్టరీని ఛేదిస్తుందో లేదో చూడాలి.