ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటనుకుంటున్నారా… తెలంగాణాలో ఉన్న వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం. ఈ పని జరిగిన వెంటనే ఒక్క అధికార పార్టీ తప్ప మిగిలిన వారంతా ప్రభుత్వం ఇరుకున పడినట్లే అనుకున్నారు. అయితే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతానన్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నిర్ణయానికి తెలంగాణ అంతటా సంబురాలు చేసుకుంటున్నారు. క్షీరాభిషేకాలు… బాణాసంచా కాల్చడాలు, మిఠాయిలు తినిపించడాలు… ఇలా ఒకటేమిటి… సంబురాలే… సంబురాలు. ఇవన్నీ చూసిన వారు మాత్రం వీఆర్వో వ్యవస్ధపై ప్రజలకు ఇంత కోపం ఉందా అని అనుకుని వాళ్లూ సంబరపడుతున్నారు.
అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నది మాత్రం ప్రతిపక్షాలే. వీఆర్వోలను వెనుకేసుకు వస్తే ప్రజలకు తాము దూరం కావడం ఖాయమని మిన్నకుండిపోయారు. ఇది తెలంగాణలో ఓ వ్యవస్థను రద్దు చేస్తే వచ్చిన రెస్పాన్స్. ఇది పక్కన పెడితే తెలంగాణాలో సీఎం కేసీఆర్ చేసిన వ్యవస్థ రద్దు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయండి జగన్ సారూ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేడుకుంటున్నారట.
మీకు కేసీఆర్ ఆదర్శం కదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టే పథకాలు, వివిధ కార్యక్రమాలకు తన స్నేహితుడు, తన శత్రువుకు శత్రువూ అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని అనుసరిస్తున్నారని పలువురు అంటుంటారు. కేసీఆర్ పథకాల్ని జగన్ కాపీ కొట్టడం, జగన్ పథకాల్ని కేసీఆర్ గమనిస్తుండడం కొత్త కాదు. అలా అనుసరించిన వాటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తారనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థపై డేగకన్ను వేసిన ముఖ్యమంత్రి వీఆర్వోల రద్దు అంశంపై ముందడుగు వేయాలని వారు సూచిస్తున్నారు. తెలంగాణ దృష్టాంతం.. వీఆర్వోల వ్యవస్థ ప్రజల్ని ఎంతగా వేధిస్తోందో.. నిరూపణలాగా కళ్ల ముందు కనిపిస్తోంది.
తనకు మాన్యుల కంటే సామాన్యులే ఎక్కువని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సామాన్యులను నానా విధాల ఇబ్బందులు పెడుతున్నవీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే మరిన్ని మంచి మార్కులు కొట్టేయవచ్చునని అంటున్నారు. చాలా విషయాలలో తెలంగాణా ముఖమంత్రి కే.చంద్రశేఖర రావు నుంచి స్ఫూర్తి పొందుతున్న ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా అదే స్ఫూర్తితో ఆ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నారు. అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని ప్రతీ వీడియో కాన్షరెన్స్ లోను చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో అత్యంత అవినీతియమైన రెవెన్యూ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.











