టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కేవలం తెలుగు సినిమాల్ని మాత్రమే అందిస్తుంది. పర్టిక్యులర్ గా తెలుగు జనం కోసమే అంకితమైన ఓటీటీలు లేకపోవడంతో.. సహజంగానే దీనిపై ఆసక్తి కలిగింది తెలుగు జనానికి. అయితే బిగినింగ్ లో దానికి అనుకున్నంత ఆదరణ దక్కలేదనే చెప్పాలి. దానికి తోడు వరుసగా మలయాళ సినిమాల్ని డబ్బింగ్ చేసి వదలుతున్నారనే టాక్ నూ మూటగట్టుకుంది. అలాంటి టైమ్ లోనే ఆహా వారు చిన్న తెలుగు సినిమాలపై దృష్టిపెట్టారు.
అతి తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాల్ని వరుసగా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. చక్కటి కంటెంట్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. భానుమతి రామకృష్ణ , కృష్ణ అండ్ హిజ్ లీల, ఒరేయ్ బుజ్జిగా, రీసెంట్ గా విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాలు సైతం మంచి విజయం సాధించడంతో .. ఆహా ఓటీటీ ఇప్పుడు ఓహో అనిపిస్తోంది.
ఓరేయ్ బుజ్జిగా సినిమా టాక్ పరంగా ఆకట్టుకోనప్పటికీ .. ఆ సినిమా విడుదల కారణంగా కొత్తగా 50వేల సబ్ స్ర్రైబర్స్ పెరిగారట. ఒక చిన్న సినిమాకి ఆ రేంజ్ లో చందాదారులు పెరగడం గ్రేటే మరి. ఆ లెక్కన చూసుకుంటే .. ఆహా కి బుజ్జిగాడు సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందన్నమాట. ఇక కలర్ ఫోటో విషయానికొస్తే ..దీన్ని కేవలం రూ.3.5కోట్లకు కొనుగోలు చేశారట. రేట్ ఎక్కువైనప్పటికీ.. దీనికి రీచ్ బాగా వచ్చిందట. ఈ సినిమా నుంచి కొత్తగా మరో 15వేల మంది చందాదారులు చేరారట. దాదాపు 16మిలియన్స్ మినిట్స్ కౌంట్ వచ్చిందట. దాంతో ఆహా పంట పండిందంటున్నారు. ఇంకా ఇందులో స్ట్రీమ్ అవడానికి మరికొన్ని చిన్న సినిమాలు రెడీ గా ఉన్నాయట. అవన్నీ కూడా కంటెంట్ పరంగా అదరగొట్టబోతున్నాయట. ఈ లెక్కన ఆహా.. మిగతా ఓటీటీలకు గట్టిపోటీనిచ్చేలాగే ఉంది మరి.











