ఏపీలో మరిన్ని బార్లు తెరిచేందుకు వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో 840 బార్లు ఉన్నాయి. వీటికి తోడు మరో 150 కొత్త బార్లకు లైనెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం బార్లకు లైసెన్సులు ఇచ్చారు. తొమ్మిదేళ్ల నుంచి జనాభా పెరిగినా బార్ల సంఖ్య మాత్రం సవరించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా బార్ల సంఖ్య ను కూడా పెంచాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అసలే అప్పులు దొరక్క, ఆదాయం కూడా పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం ఏ నెలకు ఆ నెల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు నగదు బదిలీ చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. అందుకే ఆదాయం వచ్చే ఏ చిన్న అవకాశం ఉన్నా వదులు కోవడం లేదు.
బార్లకు అంత డిమాండ్ ఉందా?
ఏపీలో బార్ల లైసెన్సులకు ఏడాదికి రూ. 21 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా రుసుం చెల్లించాల్సి వస్తోంది. మున్సిపాలిటీల్లో రూ.21 లక్షలు, జనాభా ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అయితే రూ.50 లక్షల దాకా రుసుం చెల్లించాల్సి ఉంది. బార్ అండ్ రెస్టారెండ్ నడిపేవారు ఏటా రుసుం చెల్లించి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది అదనంగా 20 శాతం కోవిడ్ టాక్సు వసూలు చేస్తున్నారు. దీంతో బార్ లైనెన్సు రెన్యువల్ మరింత భారంగా మారింది. ఈ నెలతో బార్ల లైసెన్సులు ముగుస్తాయి. అయినా నేటికీ సగం మంది కూడా లైసెన్సులు రెన్యువల్ చేయించుకోలేదు. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో లైసెన్సుల రెన్యువల్ చేయించుకోవాలా వద్దా అని యజమానులు తర్జనభర్జన పడుతున్నారు.
ఏరులైపారుతున్న తెలంగాణ మద్యం
సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. ఏపీలో ధరలతో పోల్చితే బ్రాండెడ్ మద్యం సగం రేటుకే దొరకడంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఏపీలోకి అక్రమ మద్యం వస్తోంది. దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులు కూడా ఈ దందాలో చిక్కుకుంటున్నారంటే వ్యాపారం ఎంత జోరుగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం సరిహద్దు జిల్లాల్లో బార్ లైసెన్సులపై పడింది. తెలంగాణ మద్యం చౌకగా దొరకడంతో, మద్యంప్రియులు వాటినే తక్కువ ధరకు కొనుక్కుని, మంచి ఫుడ్ దొరికే రెస్టారెంట్లలో పని కానిచ్చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉన్న బార్ల యజమానులు లైసెన్నులు రెన్యువల్ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక కొత్తగా ప్రభుత్వం బార్లు పెంచితే లైసెన్సు తీసుకోవడానికి అన్నీ జిల్లాల్లో వ్యాపారులు ముందుకు వస్తారా అంటే కష్టమేనని చెప్పొచ్చు.
తెలంగాణ మద్యం అదుపు చేస్తాం లైసెన్సులు తీసుకోండి
బార్ల లైసెన్సుల రెన్యువల్ కు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అబ్కారీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ మద్యం ఏపీలో దొరక్కుండా చేస్తామని లైసెన్సులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి అబ్కారీ అధికారులకు టార్గెట్లు పెట్టడంతో వారు నానా తంటాలు పడి బార్ల లైసెన్సులను రెన్యువల్ చేయిస్తున్నారు. ఎవరూ ముందుకు రాని కొన్ని ప్రాంతాల్లో కొందరు అబ్కారీ అధికారులు బినామీలను పెట్టి వారే పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం అనుకున్నది సాధించేలా కనిపిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఏపీలో మరో 150 కొత్త బార్లు బార్లా తెరచుకునే అవకాశం ఉంది. ఇది కూడా మద్యపాన నిషేధంలో భాగంగానే అని చెప్పుకున్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు మరి.











