భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో కొత్త వివాదం చెలరేగుతోంది. ఇప్పటి వరకూ లేని సంప్రదాయాలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెర తీసారు. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. భారతీయ జనతా పార్టీలో జాతీయ స్ధాయి నుంచి గ్రామ, వార్డు స్ధాయి వరకు ఒకే విధానం అమలు అయ్యేది. పార్టీ అధ్యక్షుడిగా ఒక్కరినే నియమించే వారు. నిజానికి జాతీయ పార్టీలన్ని ఇదే విధానాన్ని అవలంబిస్తాయి.
పార్టీ కార్యవర్గంలో ఒకే అధ్యక్షుడు ఉండడం జాతీయ పార్టీల అనవాయితీ. కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం అధ్యక్షుడిగా ఒకరిని, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మరొకరిని నియమిస్తాయి. జాతీయ పార్టీలలో ఈ పద్దతి లేదు. అయితే తెలంగాణ భారతీయ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ కు ఏకంగా ఆరుగురు అధ్యక్షులను నియమించి కొత్త బాట వేసారు.
మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా హరీష్ రెడ్డి, సికిందరాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా శ్యాంసుందర్ గౌడ్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా పాండుయాదవ్, రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడిగా సామ రంగారెడ్డి, బర్కత్ పురా అధ్యక్షుడిగా గౌతం రావు, భాగ్యనగర్ మలక్ పేట అధ్యక్షుడిగా సామారెడ్డి సురేంద్ర రెడ్డిని నియమించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలా అధ్యక్షుల సంఖ్యను పెంచి నట్టు చెబుతున్నారు.
వివాదాలకు కేంద్రంగా…
తెలంగాణలో జిల్లాలను విడదీసి అధ్యక్షుల నియామాకాలు చేపట్టడం వల్ల వివాదాలు చెలరేగుతాయని పార్టీ నాయకులు చెబతున్నారు. ఇంతకు ముందు ప్రతి జిల్లాకు ఒక్కరే నాయకులు ఉండేవారని, ఇప్పుడు అనేక మంది అధ్యక్షులు కావడంతో పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ అవుతాయని అభిప్రాయ పడుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుల సంఖ్య పెంచిన కార్యకర్తల మధ్య వివాదాలు వస్తాయని సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, కొత్తగా అధ్యక్షుల సంఖ్య పెంచితే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
జీహెచ్ ఎంసీ వ్యూహం
త్వరలో హైదరాబాద్ లో జరగనున్న జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. అభ్యర్దుల ఎంపిక, వార్డుల విభజన, మేయర్ అభ్యర్ది పేరు ప్రకటన వంటివి ముందుగానే చేయాలని, దాని ద్వారా ప్రత్యర్ది పార్టీలపై మానసిక గెలుపును సాధించినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించలేదని, సీనియర్లతో జీహెచ్ ఎంసీ ఎన్నికలపై చర్చలు జరపలేదని సీనియర్లు మండిపడతున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన వారు పార్టీలో అందరిని కలుపుకుని పనిచేసే వారని, నూతన అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో విజయం సాధించకపోతే పార్టీ పటిష్టం కావడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.











