కరోనాను ఇంకా పూర్తిగా జయించలేదని , అసలు గడ్డు కాలం ముందు ఉందని , ఏ మాత్రం అశ్రద్ధ తగదని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ రావటానికి చాలా సమయం పడుతుందని, అప్పటి వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పకుండా మాస్క్ ధరించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. మహిళలు, పిల్లలకంటే కరోనాతో పురుషులకే ఎక్కువ ప్రమాదమని తెలిపారు. సొంత వైద్యం చేసుకోవద్దని, ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించు కోవాలన్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చలి కాలంలో వేగంగా వ్యాప్తి
చలి కాలంలో కోవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కావున రాబోయే 90 రోజులు అత్యంత కీలకమని అన్నారు. పెద్ద పండుగలన్నీ ముందే ఉన్నందున వేడుకల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని సూచించారు. గుంపులుగా చేరితే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు,